పుట:మధుర గీతికలు.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



అహహ ! కోర్కెలె ఱెక్కలై యలరెనేని,
రింగురింగున నొకపెట్ట నింగి కేగసి
కొదమచందురు పడవగాఁ గుదురుపఱచి
వేడ్క వయ్యాళి వెడలనే విన్నుకడలి?

అహహ ! కోర్కెలె ఱెక్కలై యలరెనేని,
ఇనుఁడు తూర్పునఁ దోఁచక మునుపె లేచి
రివ్వురివ్వున వడి సంతరిక్ష మెగసి
సంజసరసున మునుఁగనే స్నానమాడ ?

అహహ ! కోర్కెలె ఱెక్కలై యలరెనేని,
రింగురింగున నొకపెట్ట నింగి కెగసి
చుక్కపైనుండి వేఱొక్క చుక్క కుఱికి
కోఁతికొమ్మచ్చు లాడనే కోర్కు లూఱ?

ఔర! కోర్కెలె ఱెక్కలై యమరెనేని
గాలి నొకసారి, ఒకసారి కడలినడుమ,
గిరుల నొకసారి, ఒకసారి తరులమీఁద
ఎగురుచుండనె నిరతంబు ఖగము వోలె.

15