Jump to content

పుట:మత్స్యపురాణము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

ద్వితీయాశ్వాసము


వీనుల మత్కథల్ వేడ్కతో వినువారు
       విదితమద్గుణములు చదువువారు
మత్ప్రీతిగా దానమహిమ సల్పెడువారు
       బృందావనంబులు పెంచువారు
నాణెముగ నర్థిపూజ యొనర్చువారు
నాదుభక్తులు గాన నా నరుల నెపుడు
గదియఁ బోవక విపరీతగతుల మెలఁగు
పాపకర్ముల దండింపఁ బాడి నీకు.

66


క.

హరి యిట్లానతి యిచ్చిన
వెరవున సమవర్తి యంత వీక్షించి రమా
వరపాదయుగళభక్తుల
తెర వరుగఁడు నాటనుండి దివిజాభినుతా.

67


క.

అనయము కర్మాచరణం
బున నైగుణ్యములు తఱదు ముక్తినివాసం
బునకును హేతువు లక్ష్మీ
వనితాధిపనామజపము వర్ణింపంగన్.

68


క.

నారాయణుండె దైవము
నారాయణనామజపము నరులకు ఘనసం
సారాబ్ధితరణసాధన
మారయఁ దత్పాదపూజ నణఁగు నఘంబుల్.

69


సీ.

స్వరవర్ణమంత్రసంజనితలోపంబులు
       కర్మయోగంబునఁ గలుగుఁ గానఁ
దత్కర్మనిష్ఠు లై తనరువారల కెల్ల
       విఘ్నముల్ సెందును వీక్ష సేయ
జ్ఞానయోగంబులఁ జను మహాత్ములకైనఁ
       దఱచు విఘ్నంబులు దొఱలుచుండు
నట్టి విఘ్నాత్తయోగారూఢు లగువారు
       చనరు లక్ష్మీనాథుసదనమునకు