పుట:భీమేశ్వరపురాణము.pdf/87

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 67

ప్రేక్షణీయచరణకమలు భీమనాధదేవునిన్
దక్షవాటికాపురైకధాము నాశ్రయించెదన్. 202

ఉత్సాహము. నిష్ఠతో భజింతు భీమునిం భుజంగహారునిన్
దిష్ఠునిన్ రవీష్టసంప్రతిష్ఠునిం గరిష్ఠు భూ
యిష్ఠు దక్షవాటి కాస్థలీశు దేవతాకుల
జ్యేష్ఠునిం వసిష్ఠముఖ్యశిష్టమునిజనార్చితున్. 203

లయగ్రాహి. నీమమున మ్రొక్కెదను హేమగిరిచాపునకు సామజజలంధరముఖామరవిరోధి
గ్రామమదహారి కభిరామశుభనిర్మలసుధామయశరీరునకుఁ గామితవీతీర్ణ
శ్రీమహిమశాలికి జరామరణదోషపరి, శామకనిజాంఘ్రియుగళీమృతికి దక్షా
రామపురధామునకుఁ గోమలజటామకుటధామహేమధామునకు భీమునకు భక్తిన్. 204

సీ. కొలుతు సద్యోజాతుఁ గోమలైందవతనుఁ, బెద్దగుబ్బలిరాజు బెండ్లికొడుకు
సేవింతు శ్రీవామదేవు మహాదేవు, నేడులోకంబులు నేలుఱేనిఁ
దెలుతుఁ దత్పురుషు నిందీవరవరనీల, చారుకంధరుని బశ్యల్లలాటు
బ్రణుతింతు నీశాను ఫాలనేత్రానల, జ్వాలాసమాలీఢ శంబరారి
తే. సర్గసంసారశూన్యుని సంస్తుతింతు, సర్గసంసారహేతువు సంస్మరింతు
సర్గసంసారరూపిని సంశ్రయింతు, నభవు భీమేశ్వరేశ్వరు నభిలషింతు. 205

సీ. ఎవ్వనియాజ్ఞ నీరేడులోకంబులు, నర్తించు నట్టిదేవరకుఁ గాక
గ్రహతారకములు నిక్కముగ నెవ్వని యాజ్ఞ, వర్తిల్లు నట్టిదేవరకుఁ గాక
మనువులు పదునాల్గురును యదాజ్ఞాయుక్తి, నర్తింతు రట్టిదేవరకుఁ గాక
భువనపాలకులు యద్భ్రూతాజ్ఞాయుక్తి, నర్తింతు రట్టిదేవరకుఁ గాక
తే. ధూర్జటికిఁ గాక భీమనాథునకుఁ గాక, నిఖిలకారుణ్యకల్యాణనిధికిఁ గాక
యన్యదైవంబులకు నేల యధికభక్తి, సంఘటింతుఁ గరాంబుజాంజలిపుటంబు. 206

క. క్షమియింపు భీమనాయక, కమలభవాద్యమరరాజ కాంచనమకుటీ
సముదయమణిఘృణిరేఖా, కమనీయపదాంబుజోపకంఠోద్దేశా. 207

క. కావుము దక్షారామపు, రీవల్లభ భీమనాధ త్రిజగదధీశా
కైవల్యభోగలక్ష్మి, ప్రావీణ్యప్రదకటాక్ష భక్తాధీనా. 208

క. కృపగల్గి భీమనాయక, యపరాధము సైఁపు తండ్రి వౌదువొ కావో
కృపగల్గి సుతుఁడు చేసిన, యపరాధము తండ్రి సైఁచు టర్హంబె కదా. 209

వ. అని ప్రార్థించి భక్త్యావేశంబున గద్గదస్వరకంఠుండును బాష్పాకులలోచనుండును రోమాంచపటలకంచుకితనిఖిలావయవుండును నై వెండియును. 210