50 శ్రీ భీమేశ్వరపురాణము
తే. గౌతమీసింధుకౌంతేయకణ్వనదులు, తుల్యభాగయు నేలేఱు దుమ్మికొనలు
భువనసంభావ్యమైన యీపుణ్యభూమి, యనఘ సంసారతాపశాంత్యౌషధంబు. 50
సీ. సర్వంసహకుఁ గాసె సమకట్టుపుట్టంబు, గగనంబునకు నెల్లఁ గలువసెజ్జ
యవటంబు మేఘవాహనుగంధకరటికి, నభ్యవహార మౌర్వాగ్నిశిఖకు
వంటిల్లు యామినీశ్వరకళామౌళికిఁ, దరిచోటు నిఖిలబృందారకులకుఁ
గూటకచ్ఛపనాయకునకు నిశాంతంబు, మరుజనకునికిని మనికిపట్టు
తే. ఘనశరోద్దండపాఠీనకమఠనక్ర, తిమితిమింగిలచక్రవిక్రమవిహార
ఘుమఘుమారంభగంభీరఘోషఘటిత, లటదిశాప్రతిశబ్దోపలబ్ధి యబ్ధి. 51
సీ. జనమేజయారబ్ధ సర్వాధ్వరాహూత, చక్షుశ్శ్రనస్సహస్రములఁ బోలి
బ్రహ్మాండమండలప్రాసాదసంభాగ, హరిమణిస్తంభసంహతు లనంగ
జంభారిదోస్స్తంభదంభోళిఖండితాం, జనశైలశిఖరపుంజములఁ బనఁగి
సంహారసమయఝుంఝామారుతోద్ధూత, కాలాంబువాహసంఘములఁ గెలిచి
తే. యాడుచున్నవి తీండ్రిల్లి యంబరమునఁ, జేయుచున్నవి త్రిభువనాశ్లేషకంబు
నబ్జనాభుని తూఁగుటుయ్యలలు గంటె, వేనవేలు పయోరాశి వీచిఘటలు. 52
శా. కాశిం జచ్చిన యంతఁ గాని పడయంగారాని కైవల్య మ
క్లేశం బౌనటు వేద్యనాయకునిచే లీలాగతిం జేరు రా
రో శీఘ్రంబున మర్త్యులార యను నారూపంబునన్ మోయు నా
కాశాస్ఫాలనగౌతమీజలధిసంగస్థానకల్లోలముల్. 53
మ. అది సంవేద్యము; కోటిపల్లి యదె; దక్షారామమన్ పట్టనం
బదె; యభ్రంకషసౌధకూటఘనహేలావాసముచ్ఛ్రాయసం
పద సొంపారెడు భీమలింగము మహాప్రాసాదభూమీధరం
బిదె; సప్తర్షనదీప్రవాహ మిదె; సంవీక్షింపు మేకాగ్రతన్. 54
సీ. అదె పట్టిసస్థానమందుండు వీరభ, ద్రేశ్వరస్వామి యర్ధేందుమౌళి
యదె పుండరీకాద్రి యచట మార్కండేయు నిలువేల్పు ముక్కంటి వెలసెఁ దొల్లి
యదె కుమారారామ మాహర్మ్యరేఖయ, చాళుక్యభీమేశు సదనవాటి
యదె కుక్కుటేశ్వరం బయ్యుపాంతము మేడ, హుంకారిణీదేవి యోలగంబు
తే. వాఁడె మాయింటివేల్పు పల్వలపురమున
నుండులింగంబు ఫణిరాజకుండలుండు
సప్తమునిసింధుసంగమేశ్వరుఁడు వాఁడె
కుండలాముఖ మదె మౌనికులవరేణ్య. 55