పుట:భీమేశ్వరపురాణము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 51

క. అని చూపి చెప్పి కుంభజుఁ , డినుఁ గనుఁగొని శుభముహూర్త మిదె యేతెంచెన్
మనము దిగవలయు ననుచును, మునిమండలి మ్రోల దిగిరి ముగురుం ధరకున్. 56

వ. అనంతరంబ కుంభపులినసంభవులు సంబవులు దొడిగికొని కదలి, కదళికారామంబుల రామణీయకంబును, నుల్లసిత బిల్వచిరిబిల్వవిటపంబుల పొల్పును, ద్రాక్షారుద్రాక్షఖర్జూరకేసరసరళపున్నాగనారంగంబులరంగంబును, లవంగలుంగలవలీమల్లీవల్లీమతల్లి వేల్లనంబుల యుల్లాసంబును, ఘోంటాకురంటక ఝంటికాకంటకఫలకపిత్థ లోధ్రజంబూజంబీరపారిభద్రభద్రదారుశాల్మలీగుల్మ లీలాహేవాకంబు నుద్రేకంబును, గోమలతరతమాలమాలాకారశాకోటవిటపిషండంబులమెండును, జఱకుముఱకంబును, బ్రాసంగుమిసిమియుఁ, జెంగల్వతావిఠేవయుఁ, గుసుమవాటియెసకంబును, నుభయపార్శ్వంబులం గల ఘంటామార్గంబునుగా నెడనెడం గుసుమభారారంభసంభారకుసుమగుచ్ఛచ్ఛాయావిభాసితసంధ్యారాగసరభసంబును, గందియందంబును, బెసరసిరియును, మినుమునలువును, గోధూమ శ్యామాకవరగయును, మాషతోరసమున్మేషంబును, నేసియేపును, ననంతివనకేతనంబును, నువ్వుమవ్వంబును, గుళుత్థశుద్ధార్థమానవృద్ధియు, బ్రత్తిసంపత్తియు, బొబ్బరయుబ్బరంబును, నందసందర్భంబును, యవయావనాళ ప్రియంగుగుళుజతిలపరిస్ఫూర్తియు, దవ్విందలసందడియు, గంటెకొఱ్ఱతఱచును, గసగసలినయును, జెంగలించు జాంగలిక్షేత్రంబున నేత్రంబులకు నింపుసొంపుసంసాదింప ననంతాంతరాంతరంబులు, తరతరంబు తరళ తరతరంగరించోళికాంచలంబులం జెంగులం దువాళించుచు నతిశిశిరసలిలశీకరనికర నిరతకరణపరిణతింగొల్పి పోఁకమోఁకల పూవుఁబాలల నెత్తావికిం దావలంబులై కేవలంబుపొలయు సప్తగోదావరసమీకణంబులు నాసికాపుటకుటీరంబులకుఁ గుటుంబకంబుగా మందమందగమనంబున నహిమకరబింబం బంబరవీథిసౌధకూటంబున హాటకకలశభంగి నంగీకరించుకొలఁది నభిజిద్వేళ వేలావనోపకంఠకంఠాలంకారహారధామంబైన దక్షారామంబుఁ బ్రవేశించి రంత. 57

వ్యాసాదులు దక్షారామంబుఁ బ్రవేశించుట


క. ఇటు కృష్ణద్వైపాయన, ఘటజన్ములు భీమనాయకస్వామి మహా
కటకము ముక్తి ధూటీ, కటకాభరణంబుఁ జొచ్చి కడు వేడుకతోన్. 58

తే. కర్ణికారాంబికామహాకాళిగుడికి, నందముగ నూలుపట్టిన యట్టిచాయ
సూర్యవీథికిఁ జనిరి సంశుద్ధమతులఁ, బశ్చిమద్వారమునకు నై పరమమునులు. 59

వ. అప్పుడు ఘటోద్భవుం డమ్మహాస్థానంబు సత్యవతీసూనునకుఁ జూపి వెండియు నిట్లనియె. 60