Jump to content

పుట:భీమేశ్వరపురాణము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34 శ్రీ భీమేశ్వరపురాణము

క. ఏమిశకునమునఁ జొచ్చితి, మో మన్మథదమనువీ డహోరాత్రంబుల్
మే మేడునాళ్ళదనుకను, స్వామీ! యుపవాసముండి జడిసితిమి మదిన్. 96

క. గేహముల కేగి భిక్షాం, దేహియన న్వీట నొకపతివ్రత యైనన్
సౌహార్దంబునఁ దెడ్డెం, డాహారము పెట్టదయ్యె నా దినములలోన్. 97

శా. శ్రీవిశ్వేశ్వరదేవదేవుని కృపాశ్రీచే దివోదాసు బా
హావిశ్రాంతబలంబుచేత ధవళన్యాయప్రజావృద్ధి నొ
ప్పై విశ్రామము గల్గి సుస్థిరతిరంబై యుండి భాసిల్లఁగా
నీ వారాణశిలోన భిక్ష కఱవయ్యెం జూడుమీ కుంభజా. 98

శా. వైశంపాయనుఁ డెంతయు సుడివడె న్వాడె న్సుమంతుం డతి
క్లేశం బందిరి పైలజైమినులు దుఃఖించెన్ మదీన్ దేవలుం
డాశాంతంబులు చూచె దాల్భ్యుఁ డుదరోదగ్రక్షుధాక్షోభచేఁ
గాశీపట్టనవిప్రవాటికల భిక్షాలబ్ధి లేకుండుటన్. 99

తే. అక్కటా యేమి చెప్ప వింధ్యాద్రిదమన, కాశీలో నేడు నాళ్లు నిష్కారణంబ
శిష్యులును నేను నిట్రుపాసెంబు నడితి, మమరగంగానదీసైకతములయందు. 100

వ. అష్టమదివసంబునం దరుణోదయకాలంబున గంగాపులినోత్సంగంబులం గుశశయనంబున మేలుకాంచి యభ్యుదితంబైన మార్తాండమండలం బాఖండలదిశావేదండకంఠ గ్రైవేయకనకఘంటికాఠంకారంబునుం బోలె నుదయగిరిశిఖరతటసవిధంబునం గుంకుమరజస్త్రసరేణువిసరంబునుం బోని నిగనిగ నునుజిగి గీలుకొని కోమల జిలుఁగుజిగికొనలు గగనతల మలమికొనుకొలఁది మణికర్ణికాంభఃప్రవాహంబున నఘమర్షణస్నానం బాచరించి యత్తీరవాసిజనవిరచితవాలుకాలింగంబులకుఁ బీఠార్చనాశంభులింగంబులకును ముంత్రాక్షతపుష్పకపూర్వకంబుగా నభివాదనంబుఁ జేసి పంచబ్రహ్మపంచాక్షరీమంత్రప్రధానంబులు జపియించి సిద్ధమునిపరంపరాసంకులంబైన ఘంటాపథంబునం గంగాబహిర్గేహదేహళీవిభాగంబును నంతర్గేహసౌధవీథికాట్టకుట్టిమప్రఘణంబులును గడిచి లోలార్కకాలభైరవ డుంఠివినాయక విశాలాక్షీ ప్రముఖపరివారదేవతాకోటికి నేటికోళ్లు సమర్పించి విశ్వేశ్వరు విరూపాక్షు నక్షీణమోక్షలక్ష్మీసామ్రాజ్యసింహాసనారూఢుం దారకోపదేశదేశికు దాక్షిణ్యపుణ్యకరుణాకటాక్షవీక్షాపేక్షునిఁ బ్రదక్షిణక్రమదండప్రణామపురస్సరంబుగా సేవించి ముక్తిమంటపంబునఁ గొంతతడవుండి మధ్యాహ్నకాలం బగుట నిరూపించి భిక్షాపాత్రంబులఁ గేలఁ బూని యతికఠోరజఠరక్షుధాగ్నితాపంబునకుఁ దోడగు తపనమయప్రచండకిరణకాండప్రకాండంబులు నెత్తి మండింప లేదు నడువుండు పొండుకూడ దను నిషేధవాక్యంబులు చెవులు నిండికొన