పుట:భీమేశ్వరపురాణము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 33

అగస్త్యుఁడు వ్యాసమహర్షి గాశిఁ బాసి వచ్చుటకుఁ గారణం బడుగుట

తే. ఆననమునందు వైవర్ణ్య మగ్గలించెఁ, గన్నుఁగవయందు దైన్యంబు గానఁబడియె
నార్తి నేదేనియొకటి నీయంతరంగ, మూనియున్నది యిది యెట్టులొక్కొ యనఘ. 87

సీ. లోలార్కునకు నీకు లోలోన నేమేనిఁ, బోటిపుట్టదు గదా మాటమాట
వెనకయ్య శ్రీడుంఠివిఘ్నేశ్వరస్వామి, ధిక్కరింపఁడు గదా తెగువ నిన్ను
నాఁకొన్న నిన్ను మధ్యాహ్నకాలంబున, నరయకుండదు గదా యన్నపూర్ణ
నెప మేమియును లేక నీయెడాటమ్మునఁ, బాటిఁదప్పఁడు గదా భైరవుండు
తే. ఎట్టు పాసితి మిన్నేటి యిసుకతిప్ప, లెట్టు పాసితి వాస్థలం బేరుకోసు
లెట్టు పాసితి వవిముక్తహట్టభూమి, యెట్టు పాసితి విశ్వేశు నిందుధరుని. 88

క. కాళీనందన కంఠీ, కాలుర శిరములకు విరులు కల్పించునొకో
లీలావనాంతరమునను, మాలోపాముద్ర యిడిన మల్లీవల్లుల్. 89

శా. ఆమందాకిని యాత్రి ణి వలనం బాబాహ్యకక్ష్యాస్థలం
బామధ్యాంతరకక్ష్య లావిమలదివ్యజ్యోతిరుజ్జృంభణ
శ్రీమద్విశ్వపతీశలింగము మదిం జింతింపఁ గాశీమహా
గ్రామం బిప్పుడు నాకనుంగవకు సాక్షాత్కారముం గైకొనున్. 90

శా. ఆనందంబున నర్ధరాత్రములఁ జంద్రాలోకముల్ కాయఁగా
నానాసైకతవేదికాస్థలములన్ నట్దిక్కులన్ శంభుఁ గా
శీనాథున్ దరుణేందుశేఖరు శివున్ శ్రీకంఠునిన్ బొాడుచు
న్మేనెల్లం బులకాంకురప్రకరముల్ నిండార మిన్నేటిలోన్. 91

క. గంగాయమునాతీరో, త్సంగమునఁ బ్రయాగను న్సదాశివు విశ్వే
శుం గూర్చి తపము చేసితి, నంగుష్టము ధరణి మోపి యతిఘోరముగన్. 92

తే. విస్మయము నాకు మదిలోన విస్తరిల్లెఁ, బరమధర్మజ్ఞ కాశికాపట్టనమున
సుండు మూఢాత్ముఁడైనను నొండుకడకుఁ, బోవఁ దలఁపఁడు నీ కెట్లు బుద్ధి పుట్టె? 93

వ. అనినఁ బారాశర్యుండు వాతాపిదమనున కిట్లనియె. 94

వ్యాసులు తాను గాశిఁ బాసిన కారణంబుఁ జెప్పుట

చ. సమధికసత్కవీశ్వరులు జైమినిపైలసుమంతు లాదిగా
శమదమసద్గుణాన్వితులు సాధులు శిష్యులు తోడఁ గూడిరాఁ
గ్రమమునఁ క్షేత్రయాత్రకు ధరాతలమం దఖిలంబు ద్రొక్కి భా
వము భవభక్తియుక్తముగ వచ్చితిఁ గాశికిఁ బుణ్యరాశికిన్. 95