Jump to content

పుట:భీమేశ్వరపురాణము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32 శ్రీ భీమేశ్వరపురాణము

కలుషితాంభఃప్రసాదైకకతకఫలము,
కోమలియుఁ దాను నేతెంచెఁ గుంభభవుఁడు. 78

శా. ద్వీపాంతోద్భవుఁడైన సంయమికులాధీశుండు కాలోచిత
వ్యాపారంబులు దీర్చి రేపకడ దక్షారామయాత్రోద్యమం
బాపాదించుచు నోంక్రియానగరపర్యంతార్ధమార్గంబునన్
లోపాముద్రయుఁ దాను వచ్చు ముని నాలోకించె దౌదవ్వులన్. 79

తే. ద్వాదశక్షేత్రయాత్రావిధాననియతి, భీమమండలిఁ జరియింపఁ బృథులభక్తిఁ
గుక్కుటేశ్వరు దర్శింపఁ గోర్కి పుట్టి, యట్టి పీఠాపురంబున కరుగువాని. 80

ఉ. ఱేపులు భీములింగము గుఱించి జపం బొనరించి నిచ్చలున్
మాపటిదాఁకఁ దీర్థముల మజ్జనమాడుచు నుండు వానిఁ బీ
ఠాపురి కుక్కుటేశ్వరుని డాయఁగఁ బోయెడువానిఁ దుల్యభా
గాపగ చెంత శంకరగృహాంగణ బిల్వవనాంతరంబునన్. 81

వ. అప్పరమమాహేశ్వరుం గనుంగొని సాత్యవతేయుండు ప్రత్యుత్థానంబు చేసి యెదుర్కొనియె నతండును. 82

సీ. భస్మత్రిపుండ్రాంకఫాలప్రదేశుని, రుద్రాక్షమాలికారూఢవక్షు
నుపవీతకృష్ణాజినోత్తరాంగునిఁ బల్ల, వారుణాంచితజటాపటలధారు
దామ్రపాత్రాంగుళీదర్భమూలపవిత్రుఁ దరుణకింశుకలతాదండధారుఁ
బ్రావృషేణ్యవినీలపాథోధరశ్యాము, సాలవృక్షప్రాంశుఁజారుదేహుఁ
తే. బరమభాగవతోత్తమప్రథమగణ్యు, విమలమాహేశ్వరాచారవీథిపథకు
నఖిలనీవారముష్టింపచాగ్రవరునిఁ, బులినసంభవుఁ బొడగాంచెఁ గలశజుండు. 83

ఉ. యోజనగంధినందనుఁడు నూర్వశిపట్టియు నిర్ణి రోధని
ర్వ్యాజనిరంకుశప్రణయవైభవసంపద సొంపు మానసాం
భోజములం దలిర్ప మునిపుంగవు లొండొరుఁ గౌఁగిలించి వి
భ్రాజితలీలఁ జల్పిరి పరస్పరముం గుశలప్రసంగముల్. 84

క. వినయము భక్తియు సంభ్రమ, మును సౌహార్దంబు హృదయముల మొలతేరన్
వినుతి యొనర్చి రగస్త్యున, కును వైశంపాయనాదికులు మునిశిష్యుల్. 85

వ. అనంతరం బాతుల్యభాగాతీరబిల్వతరువనాంతరంబున శశికాంతశీతలశిలాతలప్రదేశంబున నాసీనులై యిల్వలాసురదమనుండును బరాశరనందనుండును గొంతతడ విష్టకథావినోదంబులఁ బ్రొద్దువుచ్చి రప్పు డగస్త్యుండు సాత్యవతేయున కిట్టు లనియె. 86