పుట:భీమేశ్వరపురాణము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 35

విప్రవాటంబులఁ బ్రతిగేహంబును బరిభ్రమించి విసికి విసిమాలి వేసరి యలసి యారటఁబొంది సొలసి జూఁకించి తూలి దూఁపటిలి యుల్లంబునఁ గ్రోధం బుద్భవించిన. 101

శా. కుక్షిప్రోద్భవనిష్ఠురక్షుధితదుష్క్రోధాంధకారంబునం
జక్షుల్ రెండును జిమ్మచీఁకటులుగా సంరంభశుంభద్గతం
బ్రేక్షచ్చాత్రులు భీతిఁబొందఁ గడునుద్రేకించి హట్టంబునన్
బిక్షాపాత్రము రాతిమీఁద శతధాభిన్నంబుగా వైచితిన్. 102

క. అటు పౌరవీధి చక్కటిఁ, బటుకునఁ బడవైచి క్రోధపరిపాటిమెయిం
గటము లదరంగ భ్రూకుటి, నిటలములను జెమటనీరు నిండ ఘటిల్లన్. 103

క. ఏమి యని చెప్పుదును లో, పాముద్రాప్రాణనాథ ప్రజ్ఞావిభవం
బేమోయయి చెడిపోవఁగ, నామది నెన్నండు లేని నైచ్యము పొడమెన్. 104

సీ. ఏలా విచారింప నిందురేఖామౌళి, వివిధమౌక్తికధాతు • విశ్వనాథు
నేలా వితర్కింప హిమశైలశేఖరో, ష్ణీయకౌశేయంబు సిద్ధతటిని
నేలా పరీక్షింప నిభరాజవదనుని, డుంఠి విఘ్నేశు మండూకజఠరు
నేలా విలోకింప వ్రీళాకళాశూన్య , కటిఁ గాలభైరవు వటుకనాథు
తే. నిధకిలకైవల్యకల్యాణనిలయమైన, కాశిపైఁ గూడు లేకుండుకారణమున
నలిగి శపియింపఁగాఁ బూని యందుకొంటి, ధృతకమండలు భాగీరథీజలంబు. 105

ఉ. కోపము సంహరింపు మునికుంజరయంచు లలాటదేశసం
స్థాపితపాణిపద్మయుగసంఘటితాంజలిబంధులై మహా
తాపసశిష్యబృందముల్ ధర్మపథంబును దెల్పి చెప్పఁగా
శాపజలంబు పూనితిఁ బ్రశాంతివిహీనత నేమి చెప్పుదున్. 106

వ. ఇవ్విధంబున సప్తవాసరోపరవాసాయాససంభూతప్రభూతరోషావేశంబున నంగుళీపవిత్రసనాథంబైన హస్తంబున మణికర్ణికాజలంబులు ధరియించి యిట్లని శపియింప నుద్యోగించితి. 107

వ్యాసులు కాశిని శపింపఁబూనుట

శ్లో. మాభూత్త్రైపూరుషీ విద్యా, మాభూత్త్రైపూరుషం ధనమ్
మాభూత్త్రైపూరుషీ భక్తిః, కాశ్యాం నివసతాం సదా. 108

తే. అని శపింపఁగఁ బూను నయ్యవసరమున
నేమి చెప్పుదు నోసంయమీంద్రవంద్య
యుదిలగొని కంపమందుచునుండెఁ గాని
శాపజల మందుకోఁ గేలు సాఁగదయ్యె. 109