పుట:భీమేశ్వరపురాణము.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30 శ్రీ భీమేశ్వర పురాణము

తే. హేల నేలాతరంగిణీకూలనిలయ, బాల బాలారుణాశోకపల్లవోష్ఠి
వేల వేలావనోద్దేశవిహృతిలోల, నేల నేలాయనకపాడె ఋషివరుండు. 59

వ. అనంతరంబ యొక్కింత మార్గాంతరం బతిక్రమించి. 60

కుమారారామవర్ణనము

శా. ఆలోకించె మహామునీంద్రుఁడు గుమారారామమున్ వింధ్యకు
త్కీలోపాంతధరాలలామము బహుక్రీడావనశ్యామమున్
బ్రాలేయాచలకన్యకాథవజటాభారాసనార్ధేందురే
ఖాలానాయితహేమకూటకలధౌతాట్టాలకగ్రామమున్. 61

సీ. కొమరేటి కల్యాణకమలషండంబుల, సౌరభ్యభారంబు సంతరించి
నారికేళాటవీనవపుష్పకుహళికా, వితతికన్నెఱికంబు వీడుకొలిపి
యస్సరఃకాంతావిహారహాటకహర్మ్య, శశికాంతమణిగవాక్షములఁ దూఱి
భీమనాయకదేవు పేరురంబునఁ గ్రాలు, భుజగహారములకు భుక్తి వెట్టి
తే. రాజనారాయణస్వామి రమ్యభవన, తార్క్ష్యకేతనపతికి నర్తనము గఱపి
పొలసె నధ్వపరిశ్రాంతి పొడవడంగ, మౌనివరుపైఁ గుమారవనానిలములు. 62

తే. బాదరాయణుఁ డత్యంతభక్తినియతి, దివ్యవాహినిఁ గొమరేటఁ దీర్ధమాడి
శిష్యవర్గంబుఁ దాను దర్శించి మ్రొక్కి, శాశ్వతునకుఁ జాళుక్యభీమేశ్వరునకు. 63

వ. వెండియుఁ గొంత దవ్వుచని. 64

సర్పపురవర్ణనము

శా. కాంచెన్ సర్పఫురాభిధానముఁ ద్రిలింగక్షోణి వైకుంఠమున్
ముంచెన్ నారదకుండికాజలముల న్మోదంబుతో దేహమున్
జించెన్ గాశివియోగదుఃఖము మహాక్షేత్రంబు వీక్షించి ద
ర్శించెన్ సన్ముని లోచనోత్సవముగా శ్రీభావనారాయణున్. 65

సీ. శ్రీసుదర్శనశంఖచిహ్నాంకితముగాక , యెపుడు మిన్నకయున్న యిల్లు లేదు
బహులోర్ధ్వపుండ్రసంపద లేక వృథయైన, ఫాలరేఖలతోడి ప్రజయు లేదు
వైష్ణవోత్తమభాగవతసాత్త్వికులగోష్ఠి, వెలియైన వాటికావేది లేదు
నలినేక్షణుఁడు భావనారాయణస్వామి, దప్పించి పరదైవతంబు లేదు
తే. పరమగీర్వాణయాగవైభవము నెలవు, నిఖలకల్యాణగుణకేలినిలయ మనఘ
దివ్యములు నూటయెనిమిది తిరుపతులకుఁ, బరమపదమైన శ్రీసర్పపురమునందు. 66

మ. శనివారోత్సవ మాచరించె మునిశిష్యవ్రాతముం దానుఁ గ
మ్మనిపణ్యారముతోడ బూరెగమితో మండెంగ దండంబుతో