శ్రీరస్తు
శ్రీరామాయనమః
శ్రీమహా గణాధిపతయేనమః.
శ్రీమాణిక్యాంబాసమేత శ్రీ భీమేశ్వరస్వామినేనమః
శ్రీ భీమేశ్వరపురాణము
ద్వితీయాశ్వాసము
శ్రీఖండ ఘుసృణ మకరీ
రేఖాలంకార సుందరీస్తనయుగ పా
ళీ ఖచిత భుజాంతర విభ
వాఖండల! బెండపూడి యన్నామాత్యా! 1
వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పం దొడంగె. 2
తే. మృడునిచే నిట్లు కోపానఁ బడి కలంగి, గంగ దరినుండి నిజశిష్యగణము తోడ
మద్గురుస్వామి సకలధర్మజ్ఞుఁ డపుడు, పృథివిఁ గలతీర్థముల లెక్కవెట్టి చూచి. 3
వ. ఇట్లనియె. 4
తే. అంబపార్వతి నాతోడ నానతిచ్చెఁ, గాశి యెక్కుడు క్షేత్రసంఘములలోనఁ
గాశికన్నను నెక్కుడు గౌరవమున, మోక్షభోగనివాసంబు దక్షవాటి. 5
వ. తొల్లి దక్షప్రజాపతి భూచరఖేచరులగు నఖిలగీర్వాణుల రప్పించి హాటకగర్భకైటభారులఁ బురస్కరించికొని మహాధ్వరంబు సేయం బ్రారంభించి. 6
గీ. అర్థితో నోషధీశ్వరుఁ డాదియైన, [1]పెండ్లికొడుకుల నెల్లను బిలువ నంపె
గబ్బితనమున జగదీశుఁ గాలకంఠుఁ, బిలువఁ బంపకమానె నబ్బిరుదులాఁడు. 7
క. అజ్ఞానంబున హరున క, వజ్ఞదలఁచి యతని నొసలి వ్రాఁతఫలమునన్
యజ్ఞము సేసెను సురలయ, నుజ్ఞం బరోవృద్ధి కప్పనులు సమకొనునే. 8
ఉ. అల్పపుబుద్ధి నీక్రియను హాక్రతుతంత్రముఁ బన్నగాధిపా
కల్పునిఁ బాయఁబెట్టి కనుగానక దక్షుఁడు చేయఁజొచ్చి యా
వేల్పులుఁ దానుదుర్దశల వేఁగె మహాప్రళయాగ్ని రుద్రునిం
బోల్పగ వచ్చునట్టి పటుభూరివిభుండగు వీరభద్రుచేన్. 8
- ↑ పెండ్లికొడుకు = అల్లుఁడు