పుట:భీమేశ్వరపురాణము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 23

తే. పువ్వుముడిచిన పురవీధి భూమియందుఁ, గట్టె మోవంగవలసిన కారణమున
వీరభద్రునిచే దైన్యవృత్తినొందె, దక్షుఁడట్టి మహాధ్వరస్థానమునను. 10

క. తుదిఁబోయి యమ్మహేశ్వరు, పదపద్మము లాశ్రయించి బ్రతికెం దానుం
ద్రిదశులు బెద్దలువయ్యై, యదనునఁ జూపుదురు నిగ్రహానుగ్రహముల్. 11

సీ. దక్షప్రజాపతి తప్పులోఁగొని యాత్మ, గృపపుట్టి మిగుల రక్షించెఁగాన
హరివిరించిపురందరాది దైవతకోటి, మించి క్రమ్మఱ గారవించెఁగాన
నరిగి యంతర్ధానమందినతనదేవి, నెడమమేనఁ బరిగ్రహించెఁగానఁ
గోపాగ్నిఁ గడుఁబరితాపంబు నొందెడు, రిసులకు సభయంబు లొసఁగెఁగాన
తే. నఱ్ఱు దెగనేసి జున్నపుటిఱ్ఱి శిరము, గరిమచెడకుండ దివివ్రేలఁగట్టెఁగాన
నయముగలవేల్పు శ్రీభీమనాయకుండు, దక్షవాటంబు తీర్థంబుధరణియందు. 12

తే. కాలకూటోపసంహారకారి యతఁడు, త్రిపురదైత్యాధిపతుల మర్దించె నతఁడు
నిగ్రహానుగ్రహప్రౌఢినిపుణుఁ డతఁడు, సంతతము దేవవేశ్యాభుజంగుఁ డతఁడు. 13

తే. ఏమిచిత్రంబు భీమేశ్వరేశ్వరుండు, నిగ్రహానుగ్రహక్రియానిపుణుఁ డగుట
యతని నిశ్వాసముల మాత్ర నౌనొకాదొ, వేదములును జరాచరవిశ్వజగము. 14

వ. బ్రహ్మాదిసంస్తుతుండై నిజార్ధదేహంబుననున్న మాయారూపిణి, మహాదేవిభువనమోహిని, దేవకార్యప్రయోజనంబును, మేనకాదేవిభాగధేయంబును, హిమవంతుని తపోవిశేషంబును, గారణంబుగాఁ దద్దేహంబున జన్మింప నియోగించిన భువనేశ్వరి మహేశ్వరుని దేహంబువలన నిర్ముక్తయయ్యెంగావున దక్షారామంబు ముక్తిక్షేత్రంబు నాఁబరఁగె వెండియు. 15

క. దక్షుని సవనాగారము, దక్షారామంబు శివుఁడు దన్మధ్యమునం
సాక్షాత్కరించియుండుట, మోక్షము భోగంబు బ్రాఁతె ముజ్జగములకున్. 16

తే. ధాత్రివలయంబులో భోగదములు గొన్ని, మోక్షదంబులు గొన్ని పరీక్ష సేయ
భోగమోక్షములకు జన్మభూమియైన, దక్షవాటంబు ఠావు క్షేత్రములకెల్ల. 17

తే. భీమనాథేశ్వరునికన్న పెద్దవేల్పు, దక్షవాటంబుకంటె నుత్తమపదంబు
సప్తగోదావరముకంటె సకలతీర్థ, సారమగుతీర్ధరాజంబు జగతి లేదు. 18

క. అచ్చమగు భోగమోక్షము, లచ్చోటం దొరకుఁ గరతలామలకముగన్
విచ్చలవిడి బ్రతికిననుం, జచ్చినఁగడులెస్స భీమశంకరు నగరిన్. 19

క. దక్షిణవారాణశికిని, మోక్షశ్రీభోగవిభవమూలంబునకున్
దక్షారామంబునకు స,దృక్షంబగునట్టి పుణ్యక్షేత్రము గలదే. 20

సీ. కాలకూటవిషాగ్నికబళహేలాగ్రాస, కల్మాషితాసితకంఠుచేతఁ
గుంభినీధరసుతాకుచకుంభపరిరంభ, సంభావనాకేలిశాలిచేత