పుట:భీమేశ్వరపురాణము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 21

బును, సపాదలక్షగ్రంథసంఖ్యాసమన్వితంబును, నైనస్కాందపురాణంబు వినువారును నందుఁ బూర్వఖండంబునం బారాశర్యుండు నిజాపరాధంబు గారణంబుగా విశ్వనాధుచేత నధిక్షేపింపంబడి వారణాశి వెల్వడియె ననివిన్నవారగుటం జేసి యటమీఁదివృత్తాంతంబు వినువేడుక నమ్మునీంద్రు నభినందించి యిట్లనిరి. 120

తే. కాశి వెలువడివచ్చి పరాశరాత్మ, జుండు ఖేదంబు నొంది శిష్యులును దాను
నెచట వసియించె నెచ్చోట నేమి చేసె, ననఘ యేతీర్థమాడె మా కానతిమ్ము. 121

వ. అని యడిగిన. 122

మ. సరసీజాననవంశమౌక్తిక కళాసర్వజ్ఞ విజ్ఞానశం
కరినాథాంఘ్రిసరోజషట్పద సమిద్గాండీవకోదండ భూ
భరణప్రౌఢభుజాభుజంగ మహిళాపాంచాల వేమక్షమా
వరసామ్రాజ్యరమాధురంధర జగద్వ్యాప్తప్రతాపోదయా. 123

క. శ్రీవీరభద్రభూపతి, నేపాహేలాకటాక్షసిద్ధసమృద్ధ
శ్రీవిభవపాకశాసన, భావభవారాతిభక్తి పరతంత్రనిధీ. 124

మాలిని. అకుటిలనయమార్గాయాశ్రితార్థి ప్రవర్గా
సుకృతిసరణిపాంథా శుద్ధకీర్తిప్రబంధా
సకలజనవిధేయా శారదాభాగధేయా
ప్రకటసుగుణసంగా రాయవేశ్యాభుజంగా. 125

గద్య. ఇది శ్రీకమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సుకవిజనవిధేయ శ్రీనాథ నామధేయప్రణీతంబైన శ్రీ భీమేశ్వరపురాణంబను మహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.