పుట:భీమేశ్వరపురాణము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

శ్రీ భీమేశ్వరపురాణము

శ్రీ భీమనాథేశ్వరుఁడు దనకుఁదాన ప్రతిష్టితుండగుట

తే.

తారు దలఁచిన శుభవేళ దప్పకుండ, సంప్రతిష్ఠుఁడై సమర్చనము గొన్న
యమృతలింగంబు భీమనాయకునిఁ జూచి, చాల విస్మయ మందిరి సప్తమునులు.

195


వ.

ఆశ్చర్యంబునుం బొంది.

196


ఉ.

తారు వినిశ్చయించిన ప్రధానముహూర్తము దప్పకుండఁగా
మారి ప్రతిష్టఁ బొందుటకు నాత్మల సంతసముల్ వహించి యె
వ్వారొకొ మమ్ముఁ గైకొనక వారక మే మొనరింపనున్న సం
స్కారము తార చేసి రెడసందున నంచుఁ గలంగి యెంతయున్.

197


తే.

రోషసంరంభములును సంతోషములును
హృదయములఁ బిక్కటిలనున్న ఋషులకడకు
నంతరిక్షంబు నందుండి యతిరయమున
భానుమంతుండు భక్తి సంభ్రమము లెసఁగ.

198


వ.

వచ్చి యభివాదనంబు చేసి ముకుళితకరకమలుండై కమలమిత్రుం డమ్మహామునుల కిట్లనియె.

199


చ.

పరమమునీంద్రులార మిముఁ ప్రార్థన సేయుచు విన్నవించెదన్
గరుణ దలిర్ప మీచనవుఁ గైకొని నన్ను ననుగ్రహింపుఁ డీ
తెరువున మీకు నంకిలులు దీర్పఁగఁ గాలవిలంబమైన
హరుఁడు ప్రతిష్టితుండు నగు నప్పుడు నే నటు పూజ చేసితిన్.

200


క.

మీ రొనరించు ప్రతిష్టా, ప్రారంభము నాకుఁ జేయ నలవియె శ్రీద
క్షారామవిభుఁడు జగదా, ధారుఁడు గైకొనియెఁ దనకుఁదాన ప్రతిష్ఠన్.

201


క.

మేలెట్టి దట్టి శోభన, కాలము సరిగడచెనేని కాదని కంఠే
గాలుఁడు కారుణ్యసము, న్మీలితమతిఁ దనకుఁదాన నిలువంబడియెన్.

202


చ.

తనకుందాన ప్రతిష్ఠతుండయిన యీ దక్షాధ్వరధ్వంసి నే
మును పూజించితిఁ బిమ్మటన్ హరియు నంభోజాతగర్భుండునుం
గని కైసేసిరి యంతమీఁద సురలున్ గంధర్వులుం జేరి య
ర్చనముల్ చేసిరి మీరుఁ జేయుఁడు తగన్ సమ్యుక్సమారాధనల్.

203


తే.

అనిన సంయములును గాలయాపనమునఁ , జంద్రశేఖరు సంప్రతిష్టాపనంబు
తమకు సిద్ధింపకునికి సంతాపమొంద, బలికె నాకాశవాణి విస్పష్టఫణితి.

204


ఉ.

ఓ పరమర్షులార కరుణోదధి యిందువతంసుఁ డాత్మసం
స్థాపితుఁ డయ్యు మీ దెసఁ బ్రసాదముపేర్మి భవత్ప్రయత్నసం
స్థాపితుఁ డైనవాఁడ యిది సత్యము మీరు మనంబులోన సం
తాపముఁ బొందకుండుఁడు ప్రధానము భక్తియె కాదె యిమ్మహిన్.

205