పుట:భీమేశ్వరపురాణము.pdf/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

97


తే.

అల్పమే మీరు చేసినయట్టి భక్తి, యభవమూర్ధాభిషేకార్థ మధికభక్తి
దెచ్చితిరి గౌతమీమహాదివ్యతటినిఁ, బాదపీఠోపకంఠభూభాగమునకు.

206


మ.

అభిమానించిన మీర లేడ్వురు బ్రతిష్ఠారంభకాలంబునం
దభిషేకించిన తిగ్మభానుఁడును నేకార్థక్రియ న్మించువాం
డ్రు భవార్చారతి నెంచ మీర లెనమండ్రుం నిల్పినా రంబికా
విభునిన్ సత్యమ నేను చెప్పితి నభోవీథీవిటంకంబునన్.

207


తే.

మీర లెనమండ్రు భుజగేంద్రహారునొద్ద, భక్తిఁ బూజింపఁ బెట్టుఁడు పాశుపతుల
వారిపే రష్టమూర్తులు గారవమున, వారుదాఁకఁగ నర్హు లెవ్వారలైన.

208


తే.

అష్టమూర్తి విశిష్టాన్వయప్రసూతుఁ, డర్హుఁ డేపాటివాఁడైన నభపు నంట
వేదశాస్త్రపురాణసంవేదియైన, నితరుఁ డర్హుండు గాండు భీమేశు నంట.

209


వ.

అని యాకాశవాణి మీరలును సూర్యుండును సములని యుద్దేశించి పల్కిన విని హర్షంబు నొంది మహర్షులు నభోమణి నభినందించి యతండును దామును హేమకుంభంబుల సప్తగోదావరప్రవాహాంబుపూరంబులు దెచ్చి యయ్యభవు నభిషేకించి పూజించిరి; సప్తర్షిసమానీత గావున నమ్మహానదికి సప్తగోదావరాహ్వయంబు సంభవించెనని చెప్పుటయు శ్రీభీమేశ్వరమహాదేవుమాహాత్మ్యంబు విన వేడుక యయ్యెడు నయ్యీశానుపుణ్యకథావిధానంబు వినిపింపవే యనుటయు.

210


మ.

అవనీభారధురీణ రీణరిపుసైన్యాధీశ ధీశక్తివై
భవలీలాజితకావ్య కావ్యరచనాపారీణతావాస వా
సవభోగప్రతిమాన మానవినయాచారార్థసంభార భా
రవిసంకాశమహాకవీంద్రపరిషత్ప్రస్తూయమానోదయా.

211


క.

కాశ్యపగోత్రపవిత్ర య, వశ్యా యధరాధరోద్భవాధిపభక్తా
వేశ్యాకటాక్షదీక్షా, వశ్యవిహారాపహసిత వాసవతనయా.

212


మాలిని.

కమలభవవధూటీ కంఠకహ్లారమాలా
సముదితమధుహారా సౌరభాసారలక్ష్మీ
సమధికరుచిసంపత్సార సారస్వత శ్రీ
హిమితసుకవిరోధీడ్ఢృత్సరోజాతజాతా.

213


గద్య.

ఇది శ్రీకమలనాభపౌత్ర మారయామాత్యసుపుత్ర సుకవిజనవిధేయ సకలవిద్యాసనాథ శ్రీనాథనామధేయ ప్రణీతం బైనశ్రీభీమేశ్వరపురాణం బనుమహాప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము.