Jump to content

పుట:భీమేశ్వరపురాణము.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

93


తే.

యక్షగంధర్వసిద్ధవిద్యాధరోర, గామరవ్రాతభరితోభయప్రతీర
పృథివియెల్లను రక్షించు పేరఁటాలు, మమ్ము రక్షించు గోదావరమ్మ యెపుడు.

166


తే.

అమృత మైనపయోధార నహరహంబు, సృష్టిఁ గల జంతుకోట్ల రక్షింతు వీవు
జనని వౌటకు నేమి సంశయము చెపుమ, గౌతమీగంగ యాలోలఘనతరంగ.

167


క.

త్రైలోక్యవరదపావన, నాళీకాననకరాబ్జ నవమణికుండీ
కూలంకషసలిలామృత, పాలింపు గిరీశజాయ పర్వతతనయా.

168


క.

గోదావరి గోదావరి, గోదావరి యంచుఁ బల్కు గుణనంతులకున్
గోదావరితల్లీ సం, పాదింతుగదమ్మ నీవు భవ్యశుభంబుల్.

169


క.

కంబుశశిరజతశుక్తివి, డంబసితచ్ఛాయకలిత డంబరములు నీ
యంబువు లమృతోపమరుచు, లంబా మా కొసఁగుఁగాత నభ్యుదయంబుల్.

170


శా.

ఆపాతాళగభీరనీరకసుధాహారామలచ్ఛాయకున్
ద్వీపాలంకృతికి న్మహేంద్రనగరీనిశ్రేణికాయష్టికిం
దాపోపాయవిధావిహర్తికి మహోదన్వాదృఢాలింగన
వ్యాపారప్రతిపన్నసౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్.

171


శా.

రంభోరూకరశాతకుంభఘటధారాపూరణప్రక్రియా
గంభీరత్వణసాంద్రభిన్నకరిరాడ్గండూషనిర్భిన్నకు
న్సంభావించి నమస్కరింతుము త్రిసంధ్యంబున్ ముదంబొప్ప నీ
కంభోజాసనకుండికాంబుజననీహంసాభ గోదావరీ.

172


క.

గౌతమికిన్ బంచమహా, పాతకసటలాంధకారపాటనవిధిరా
డ్గౌతమికి నమస్కారం, బాతతనుతిఁ జేయుదము ప్రయత్నం బెసఁగన్.

173


వ.

అని ప్రార్థించి యిట్లనిరి.

174


సీ.

విచ్చేయవమ్మ శ్రీవృషభవాహనధర, సామజకటమదాసారధార
పయనంబుగావమ్మ భర్గజటాటవీ, కుటజశాఖాశిఖాకోరకంబ
రావమ్మ యాదిమబ్రహ్మదోఃపల్లవ, స్థితకమండలుపుణ్యతీర్థజలమ
లేవమ్మ విశ్వంభరావధూటీకంఠ, తారమౌక్తికహారధామకంబ


తే.

తెరలతో వీచికలతోడఁ దరులతోడ, విమలడిండీరఖండదండకములతోడ
మురువు ఠీవియు నామోదమును జవంబు, వడువు నొప్పంగ గంగమ్మ నడువవమ్మ.

175


మ.

అదె మాస్వామి సుధారసోద్భవుఁడు దక్షారామభీమేశుఁ డ
భ్యుదయంబొంది ప్రతిష్ఠఁ గైకొనెడు నంభోరాశితీరంబునన్
బదమా షట్పదమాలికాపరిలసత్పాథోధునీసంపదా
స్పదనానాసలిలప్రవాహలహరీసంభారగోదావరీ.

176