పుట:భాస్కరరామాయణము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అని పలుక సంతసిలి యా, ఘనవిద్యాకలితుఁ డగుచుఁ గౌసల్యానం
దనుఁడు శరత్కాలోదిత, దినకరుచందమున వెలిఁగెఁ దేజం బెసఁగన్.

217


వ.

అంత నమ్మునికి గురుశుశ్రూష లాచరించి తానును దమ్ముండును గౌశికుండును
దృణశయ్యల నిద్రించి యారాత్రి వేగిన.

218


క.

తనసుతులఁబోలె నుపలా, లనముల మేల్కొలుప రామలక్ష్మణులు రయం
బున మేల్కని యాహ్నికవిధు, లొనరిచి మునిపతికి మ్రొక్కి యుత్సవ మెనఁగన్.

219

అంగదేశవృత్తాంతమును రామలక్ష్మణులకు విశ్వామిత్రుఁడు చెప్పుట

వ.

గమనోద్యుక్తు లై చని ముంగట జాహ్నవిఁ గనుంగొని యచట సరయూసంగ
మంబున ననేకదివ్యసహస్రవర్షంబు లత్యుగ్రతపంబు లాచరించిన పుణ్యతపోవ
నాలయంబు నొక్కటిఁ గనుంగొని కౌశికుం జూచి యిప్పుణ్యాశ్రమం బెవ్వరియా
శ్రమం బి దెవ్వరు తపంబు సేసిరి మా కెఱుంగ నానతిం డనుడు దరహసితము
ఖుండై కౌశికుండు రాఘవులతో నిట్లనియె మున్నిచ్చటఁ గందర్పుండు మూర్తి
మంతుఁడై కాముం డనఁ బరఁగె నిది కామాశ్రమం బీయాశ్రమంబున.

220


క.

హరుఁడు దప మాచరింపఁగ, హరుతప ముడిగించి మించి యద్రితనూజన్
హరునకుఁ బెండిలి చేసెద, వెరవుగ సురహితముఁ జేసి వెలసెద ననుచున్.

221


క.

దర్పకుఁ డెంతయు భుజబల, దర్పంబున హరుఁ గలంపఁ దలకొని చేరన్
దర్పకుని నుగ్రదృష్టిని, దర్ప మడంపంగ హరుఁ డుదగ్రతఁ జూడన్.

222


క.

అంగములు దొలఁగి కాముఁ డ, నంగుఁ డనం బరఁగె నతనియంగంబులు భూ
రంగమున నెరయఁ బడఁ ద, త్సంగతి నాదేశ మంగసంజ్ఞన్ వెలసెన్.

223


వ.

ఇప్పుణ్యాశ్రమంబున మదీయశిష్యు లయినతపోధను లున్నవా రిక్కడ నివాస
యోగ్యం బగు నీయుభయనదీమధ్యంబు పుణ్యదేశం బిచ్చటఁ బూతస్నాతుల మై
జపహోమాదు లైనయాహ్నికకృత్యంబు లాచరించి యీరాత్రి యిచ్చట
వసియించి యెల్లి యిమ్మహావాహిని దాఁటి [1]పోద మన నంత నక్కడి మును లే
తెంచి నమస్కారపూర్వకంబుగా విశ్వామిత్రున కర్ఘ్యపాద్యప్రముఖాతిథిసత్కా
రంబు లాచరించి పదంపడి రామలక్ష్మణుల నుచితక్రమంబుల సన్మానించి [2]నిజమం
దిరములకుం గొనిపోవ విహితసాయంకాలానుష్ఠానంబు లాచరించి యారాత్రి
పుచ్చి మఱునాఁ డమ్మునులు గొలిచివచ్చి నావ పెట్టించి యింక విచ్చేయుం డన
నగుం గాక యని యమ్మునుల వీడ్కొని నావ యెక్కి యమ్మువ్వురు నెలమి.

224


తే.

నావ నానది దాఁటుచో నడుమ రామ
లక్ష్మణులు మునిఁ జూచి యుల్లాస మొదవ
భంగసంఘాతభంగురాంభఃప్రభూత
తుములఘోషంబు లధికాద్భుకతముగఁ బర్వి.

  1. పొదం డన
  2. నిజశిబిరంబులకుం గొని