పుట:భాస్కరరామాయణము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పాలుఁడు లోకపాలుఁడుఁ గృపాళుఁడు సజ్జనపాలుఁ డన్యభూ
పాలుర యజ్ఞపాలనకుఁ [1]బాడిగ నే నిటు కోరి వత్తునే.

176


చ.

అలఁతిగఁ జూడ కీతనిమహత్త్వ మెఱుంగు వసిష్ఠుఁ డీమహా
బలుఁడు మదీయయాగపరిపాలనదక్షుఁడు దుష్టరాక్షసా
వలియెడ నిర్భయుండు మది వందకు నీసుతు వజ్రవర్మ మై
యలవడఁ గాచి తెచ్చెద సమగ్రతరం బగు మేలు నిచ్చెదన్.

177


వ.

అని యట్లు విశ్వామిత్రుండు పలికిన.

178


క.

కువలయపతి కపుడు తనూ, భవుఁ బుత్తె మ్మనమునీంద్రభాషణము ఘన
శ్రవణవిదారణదారుణ, రవ మై వినిపింప మూర్ఛ [2]గ్రక్కున ముంపన్.

179


వ.

సింహాసనచలితుం డగుచు దశరథుం డల్లన తెలిసి.

180


క.

ఉల్లము జ ల్లన నెంతయుఁ, దల్లడ మందుచు విషాకతప్తుం డగుచుం
బెల్లుగ భయమును బ్రేమయు, మల్లడిగొన మౌనిఁ జూచి మనుజేశుఁ డనున్.

181


క.

బాలుఁ డకృతాస్త్రుఁ డబలుం, డాలంబులతెఱఁగు లెఱుఁగఁ డరులు జయింపం
జాలునె నిశాటవికటా, భీలాకారములు చూచి బెగ్గిల కున్నే.

182


క.

పరనిజశక్తు లెఱుంగఁడు, గురుతరశస్త్రప్రయోగకుశలుఁడు గాఁ డు
ద్ధురరిపుసాధనహతులకుఁ దెరలఁగ సైరింపఁగలఁడె దృఢదేహుం డై.

183


క.

అఱువదివేలబ్దంబులు, నెఱయఁగ మని సుతులఁ గనని నెవ్వగచేతన్
మఱుఁగుచు జర మేనం గ్రి, క్కిఱియఁగఁ దఱి దప్పి సుతుల [3]ని ట్లేఁ గంటిన్.

184


వ.

ఆసుతులలోన.

185


క.

రాముం డగ్రతనూజుఁడు, రాముఁడు కులవర్ధనుండు రాముఁడు ప్రియుఁ డే
రామునిఁ బుత్తేఁ జాలను, రాముని నేఁ బాసి క్షణము బ్రదుకఁగ నోపన్.

186


క.

పదియేనేఁడులబాలుని, సదమలగుణుఁ గాకపక్షసంయుతు ని ట్లే
నదయతఁ బుత్తేఁ జాలను, సదయుఁడ వగు రామువలన సంయమివర్యా.

187


క.

అక్షౌహిణిసామంతుల, నీక్షణమునఁ గొనుచు వేగ మే వచ్చెద నా
రాక్షసుల కెదిరి నీమఖ, రక్ష యొనర్చెదను ధరను బ్రదికినదాఁకన్.

188


వ.

అట్లు గా కున్న.

189


క.

నానందను నొక్కనిఁ జను, నా నామది సొరదు గాని నందనుతోడన్
నానాసేనలతో నట, కే నేతెంచెదఁ గడంక నేఁగు మునీంద్రా.

190


వ.

అని పలికి.

191


శా.

ఆరాత్రించరు లెవ్వ రెవ్వఁడు మఖాపాయంబుఁ బొందింపఁగా
వారిం బంచినవాఁడు వారలబలవ్యాపార మేచంద మా
క్రూరాఘాన్వితవృత్తు లెవ్వనిసుతుల్ ఘోరాజిలో వారి నా

  1. బాలుగ; బాలుర
  2. గ్రమ్మఱ
  3. నెట్లో