Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గలఁగి తొలంగక నాతో, [1]నిలిచి రణము సేసినపుడ నిను నే మెత్తున్.

1043


తే.

అనుచు నొక్కటియును మూఁడు నైదు నేడు, గా ననేకసాయకములు ఘనపథమ్ము
నిండ నిగిడించె మర్మప్రచండకిరణు, కిరణజాలప్రసారవిస్ఫురణ మమర.

1044


వ.

అవియు నవ్వీరుం డర్ధచంద్రాస్త్రంబులం ద్రుంచిన.

1045


క.

కనలి నిశాచరుఁడు మహా, శనికల్పం బగుచు వెలుఁగుశర మొక్కటి వే
కొని బలుతెగఁ బెన్నురమునఁ, జొనిపి సుమిత్రాతనూజు స్రుక్కం జేసెన్.

1046


తే.

బాణహతి నించుకయ డిల్లపాటు గలిగి, తోనతిర మైనధైర్యంబుతోడఁ బొలిచి
తొరఁగు నెత్తుట నొడ లెల్లఁ దోఁగ నట్లు, [2]నెఱనునో గొన్నయక్కోలఁ బెఱికివైచి.

1047


శా.

నిండం గీలలు గ్రమ్మ రాకొమరుఁ డాగ్నేయాస్త్ర ముద్దండదో
ర్దండాటోపము సూపఁ జండతరకోదండప్రకాండంబుఁ జే
ర్పం డంకారభయంకరాయతధనుర్జ్యావల్లి సంధించెఁ బ్ర
హ్మాండం బెల్ల వెలుంగ ఘోరముగ రౌద్రాస్త్రంబుఁ బౌలస్త్యుఁడున్.

1048


చ.

ధనువుల నిట్లు బాణములు దారుణలీల నమర్చి బల్దెగల్
గొని నిగిడింప రెండుఁ బ్రతికూలగతిం గులిశద్వయంబుచా
డ్పునఁ బఱతెంచి మంటలు మిడుంగుఱులుం బెదరంగఁ దాఁకి వే
పొనుపడి భస్మ మై పొలిసి పోయెఁ బరస్పరతుల్యశక్తులన్.

1049


క.

దోషాచరుఁ డప్పుడు పై, నైషికబాణంబు వఱప నైంద్రాస్త్రమునన్
రోషాకులుఁ డగుచు మహా, భీషణగతి లక్ష్మణుండు పెలుచం ద్రుంచెన్.

1050


శా.

ఆయేటుం దనకోలపాటుఁ గని యామ్యాస్త్రంబు సంధించి వాఁ
డేయం గ్రమ్మఱ నమ్మహాభుజుఁడు లో నేపారుకోపంబుతో
వాయవ్యాస్త్రముచేత దాని నడుమన్ వారించుచుం గప్పె వి
ల్మ్రోయం బె ల్లగుచిత్తజల్లుగతిగాఁ గ్రొవ్వాఁడిబాణంబులన్.

1051


ఆ.

అవియు వానిదివ్యకవచంబుపైఁ బడి, బిట్టు మొనలు దునియ మిట్టిపడిన
మఱియు నలుక నేసె నెఱనారసములను, గంకటమున కవియుఁ గాక చెదరె.

1052


వ.

అట్లు కవచంబు భేదింపంజాలక విస్మితుం డగుచుండ వాయుదేవుండు సనుదెం
చి యిది యనన్యాస్త్రభేద్యంబు బ్రహ్మాస్త్రప్రయోగంబున వీని వధియింతు గా
కనుచు నుపదేశించి చనియె నంత నాసుమిత్రాపుత్రుండును.

1053


క.

బ్రహ్మకు డాక న్నదరఁగ, బ్రహ్మాండము ప్రభలు నిండక బలుపుట్ట మహా
జిహ్మగము వెడలుగతి నా, బ్రహ్మాస్త్రముఁ దూణిఁ దిగిచి పటువేగమునన్.

1054


చ.

నిరతము గాఁగ వింటఁ దొడి నిండుదెగన్ వడి నేయ నమ్మహా
శర మెడమాఱుసేయునిషుశక్తిగదాదులఁ గాల్చుచున్ భయం
కరగతిఁ బాఱి రక్కసునికంఠము ద్రుంచెను మేరుశృంగము

  1. జలిపి రణము నిలిచినపుడ చాలఁగ మెత్తున్.
  2. నెఱఁకు లోఁగొన్న