పుట:భాస్కరరామాయణము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామభరతలక్ష్మణశత్రుఘ్నులజననము

సీ.

వెలయఁ బండ్రెండవనెలయందుఁ జైత్రపు, నర్వసుబుధశుద్ధనవమినాఁడు
పంచగ్రహంబులు పరఁగ నుచ్చస్థాన, గతులుగా గురుసుధాకరులు గూడఁ
గర్కటకాఖ్యలఁగ్నమునందుఁ గౌసల్య, [1]హరి కర్ధ మగురాము నమరఁ గనియె
గురువారమునఁ జారుతరమీనలగ్నంబు, నను బుణ్యదశమిదినమునఁ గయిక
పద్మనాభునంశంబున భరతుఁ గనియెఁ, గర్కటకలగ్న మాశ్లేషకావ్యవార
మమర నేకాదశిని విష్ణు నంశమున సు, మిత్ర లక్ష్మణు శత్రుఘ్ను మెఱయఁ గనియె.

156


క.

సుర లపుడు పుష్పవర్షము, గురిసిరి మొగి నప్సరసలు గొమరారఁగ నా
డిరి గంధర్వులు పాడిరి, సురదుందుభు లోలి మొరసె సురుచిరభంగిన్.

157


మ.

సతతాకీర్ణము లై పురిం జెలఁగె నిస్సాణౌఘనాదంబు[2]లుం
దతరాగాన్వితమంత్రనాదములు నుద్యత్సూతవందిస్తవో
ర్జితనాదంబులు గీతనాదములు యోషిన్నృత్యభూషాసమం
చితవాద్యస్ఫుటనాదముల్ బుధజనాశీర్వాదవాదంబులున్.

158


వ.

ఇ ట్లనేకప్రకారంబుల సకలజనులు నభినందింపఁ బుత్రమహోత్సవంబు నిర్వ
ర్తించి దశరథుండు పరిపూర్ణమనోరథుండై సూతవందిమాగధులకుం బసదనంబు
లొసంగి భూసురోత్తములకు బహుసువర్ణంబులుఁ బెక్కుగోవులు ననేకరత్నం
బులు దానంబులు సేసి సకలజనుల నిష్టాన్నపానాదులం దృప్తులం జేసి పదంపడి
వసిష్ఠునిం బిలిపించి పండ్రెండవదినమునం బుణ్యాహవాచనపూర్వకంబుగా జాత
కర్మంబులు సేయించి నామకరణంబు లొనరింపు మనుచుఁ బలికిన నమ్మునివరుండు.

159


క.

ఘను నగ్రతనయు రాముం డనుచుం గైకసుతు భరతుఁ డనుచు సుమిత్రా
తనయులఁ గ్రమమున లక్ష్మణుఁ, డనుచును శత్రఘ్నుఁ డనుచు నాఖ్యలు సేసెన్.

160


సీ.

అంత బాలక్రీడ లాదిగాఁ దమలోనఁ, గవగూడి రామలక్ష్మణులు భరత
శత్రుఘ్నులును [3]బొ ల్పెసఁగ వేదశాస్త్రముల్, చన ధనుర్వేదంబు సకలకళలు
నభ్యసించుచు నాయుధాభ్యాసములు వాహ, నారోహణాదులు నాస్థతోడ
నలవరించుచు వార లన్యోన్యరాగు లై, యమర నేకగ్రీవు లగుచు గురుల
కెలమి శుశ్రూష సేయుచు నెల్లజనులుఁ, బొగడ ధీరులు శూరులై బుద్ధి నీతిఁ
బుణ్యమునఁ దేజమునఁ బేర్మి భూతి నఖిల, సుగుణముల నొప్పుచుండిరి సొంపు లెసఁగ.

161


వ.

అంత నొక్కనాఁడు.

162


క.

గుణకర్షజనితపరుష, వ్రణకిణపటుబాహుయుతులు వాజిగజారో
హణకఠినాంగుల సతతో, ల్బణశస్త్రాభ్యాసక లితకలఘుతరతనులన్.

163


క.

తనయులఁ గనుఁగొని జనపతి, మునుకొని వేడుక వివాహములు సేయఁగ యౌ
వనకాల మయ్యె ననుచుం, దనమదిఁ దలపోయుచుండఁ దత్సమయమునన్.

164
  1. హరి కంశ మగు
  2. లుద్ధత దాసాన్విత
  3. 'నోలి సరి వేద' వ్రా. ప్ర.