పుట:భాస్కరరామాయణము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నభయ మిచ్చి మమ్ము నాదరింపుము మాకు, దేవ గతియు నీవ దిక్కు నీవ.

135


క.

నరుచేతఁ దక్క వాఁ డొం, డొరుచే నీల్గండు దశరథోర్వీశసతుల్
[1]సిరికిన్ వాణికి గౌరికి, సరి యయి యున్నారు పుణ్యసదమలమతులన్.

136


క.

చతురంశంబుల మనుజా, కృతు లలవడఁ బూని యధికకృపఁ బంక్తిరథ
క్షితిపతిసతులకు నలువురు, సుతు లయి జనియింపవలయు సురహిత మెసఁగన్.

137


ఉ.

కావున మర్త్యరూప మిలఁ గైకొని పావనుఁ డైన రాఘవ
క్ష్మావరపుత్రుఁ డై పొడమి చండపరాక్రమలీల లోకవి
ద్రావణు రావణుం దునిమి ధర్మ మెలర్ప సమస్తదేవభూ
దేవగణంబులన్ మనుపు దిక్కుల నీనిజకీర్తి వర్ధిలన్.

138


చ.

అన విని విూర లింక భయ మందక నెమ్మది నుండుఁ డే నిలన్
మనుజుఁడ నై జనించి సుతమంత్రిసహోదరవాహినీసుహృ
జ్జనసహితంబు గాఁగ సురశత్రుని రావణుఁ ద్రుంచి కీర్తి గై
కొని తగ వర్షముల్ పదునొకొండుసహస్రము లుర్వి యేలెదన్.

139


వ.

అని పలికి సర్వలోకేశుం డగులక్ష్మీశుండు నిజలోకంబున కరిగెఁ దదనంతరంబ.

140


క.

అతినుత మగునాక్రతువున, వితతోద్ధత హోమధూమకవితతులు నానా
తతఘృతధారాహుతి వ, ర్ధితపావకశిఖలు గలయ దీప్తంబులుగన్.

141

ప్రాజాపత్యపురుషుండు దశరథునకుఁ బాయసాన్నం బిచ్చుట

వ.

అప్పు డప్పావనహోమాగ్నివలనం గృష్ణవర్ణుండును రక్తాంబరధరుండును రక్తా
సనుండును దుందుభిస్వనుండును స్నిగ్ధహర్యక్షసదృక్షరోముండును దివ్యభూషణ
భూషితుండును దివాకరసమాకారుండును దీప్తానలశిఖోపమానుండును నగునొ
క్కదివ్యపురుషుండు గలధౌతమయపాత్రాంతరితపవిత్రహేమపాత్రంబు హస్తం
బున నమర వెడలి దశరథు నీక్షించి నేను బ్రాజాపత్యపురుషుండ దేవనిర్మితం
బును నారోగ్యవర్ధనంబును బుత్రోత్పత్తికరంబును నగునిప్పాయసంబు నీప్రియ
పత్నుల కొసంగు మంచుఁ బలికి.

142


క.

తన కవ్విభుఁడు ప్రదక్షిణ, మొనరించి నమస్కరింప [2]నుజ్జ్వల మగుకాం
చనపాత్ర మిచ్చి వేగం, బున నాపురుషుం డదృశ్యపురుషుం డయ్యెన్.

143


చ.

జనవిభుఁ డంత నెంతయును సంతస మందుచుఁ గాంక్షతోడ ని
ర్ధనుఁడు ధనంబు గన్నగతి దత్పరమాన్నసువర్ణపాత్రముం
గొని చని యాత్మపత్నులకుఁ గోర్కిగ నా వరపాయసాన్నముం
గనుకని రెండుభాగములు గా నొనరించి తగంగ నందులోన్.

144


తే.

సగము కౌసల్య కిచ్చి యాసగములోన, సగము దగ సుమిత్రకు నిచ్చి చనఁగ నున్న
సగము కైకకు నిచ్చియాసగములోన, సగము మఱి సుమిత్రకు నిచ్చె సమ్మదమున.

145
  1. సిరికిన్ హ్రీకిని గీర్తికి
  2. నోదన మగుకాం