పుట:భాస్కరరామాయణము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అట్లు చింతించి యాసుర లజునితోడ, ధాత నీప్రసాదంబు తద్దయును బడసి
యఖిలజనులకు నవిజయ్యుఁ డగుచు నిపుడు, రావణుం డనువాఁడు గర్వంబు మెఱసి.

123


క.

వాసవసురమునిగంధ, ర్వాసురయక్షావనీసురావలి నెపుడుం
[1]గాసిల నలఁచుచు నుండన్, వేసరితిమి వాఁడు సేయువికృతుల కెదలన్.

124


వ.

వానిం బేర్కొన్న.

125


క.

కడ లెత్తి మ్రోయ వెఱచును, జడనిధు లినుఁ డెండ గాయ శంకిలు వానిం
బొడఁగనునెడ వాయువు లుర, వడి వీవక యడఁగు గిరులు వడవడ వడఁకున్.

126


క.

నీవరకారణమున నా, రావణుచే ముజ్జగములు ప్రలయము వొందుం
గావున వానిన్ వే ని, ర్జీవునిఁ జేయంగ నీవు చింతింపు మజా.

127


వ.

అనవుడుఁ గమలాసనుం డనిమిషులం గనుంగొని.

128


క.

సురయక్షాసురరజనీ, చరకిన్నరసిద్ధసాధ్యచారణవిద్యా
ధరగంధర్వాదులచే, మరణము నొందండు వాఁడు మావరశక్తిన్.

129


క.

నరులవలనఁ జావకుండఁగ, వర మడుగఁగ మఱచె నన్ను వాఁ డవమతిమై
ధరలో నటు గావున సం, గరమున నరుచేతఁ జచ్చు గర్వం బడఁగన్.

130


మ.

నరసింహాకృతిఁ బూని భీకరగతిన్ నారాయణుం దుద్దతో
ద్దుర బాహాబలుఁ డై హిరణ్యకశివుం దున్మాడి సంప్రీతి నా
దర మారన్ సురకోటిఁ బ్రోచెఁ దగ నాదైత్యాధినాథుండ యి
ద్ధర జన్మించెను రావణుం డనఁ బులస్త్యబ్రహ్మకుం బుత్రుఁ డై.

131


క.

దురమున దశకంఠుని వెసఁ, బరిమార్చి సమస్తసురలఁ బాలించు ధరన్
నరుఁడయి విష్ణుఁడు మన మా, హరి శరణము సొత్త మనఁగ నంతటిలోనన్.

132


లయగ్రాహి.

వక్షమున శ్రీసతియు నక్షుల శశాంకజగదక్షులుఁ ద్రిలోకకరణక్షముఁడు నాభిం
గుక్షి భువనంబులును బక్షిపతి కేతువున లక్షితకరంబుల విపక్షకులశిక్షా
దక్ష మగుచక్రమును ఋక్షపసదృక్షసువకళక్ష మగుశంఖమును నీక్షకులకుం బ్ర
త్యక్షములు గాఁగఁ గమలాక్షుఁ డరుదెంచెను సమక్షదివిజావలికి నీక్షణము లారన్.

133


క.

హరి కప్పుడు మ్రొక్కుచు సురు, చిరమతి సన్నుతులు సేసి చెప్పంగఁ దొడం
గిరి గీర్వాణులు దశకం, ధరుచేతం దమకు నయిన దారుణబాధల్.

134


సీ.

అఖిలేశ రావణుం డనురాక్షసేశుండు, బ్రహ్మవరంబునఁ బ్రబలుఁ డగుచు
నందనవనమున నలువొంద విహరించు, నప్సరస్సంఘంబు నడరి త్రుంచె
మునుల విచారించెఁ గనలి గంధర్వులఁ, బరిమార్చి దనుజులఁ బరిభవించె
[2]నమరుల నిర్జించె నసురుల భంజించె, యక్షులఁ దోలె గుహ్యకులఁ బఱపె
వానిదాడి కోడి వచ్చితి మిచటికి, నిను శరణు సొరఁగ నీవు కరుణ

  1. గాసిలి యులంపుచుండన్; గాసిగఁ గలంపుచుండన్.
  2. ‘అహికోటి మర్దించె యాశుధానులు దక్క, నఖిలభూతంబుల నాక్రమించె' అని పా.