పుట:భాస్కరరామాయణము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యింతవృత్తాంతమును మున్ను యెఱుఁగఁ గంటి
మును సనత్కుమారుఁడు సెప్ప మునులయెదుర.

88


క.

అమ్ముని యధ్వర్యుఁడు గా, సమ్మతి హయమేధ మీవు సనఁ జేసి ప్రమో
దమ్మున నలువురఁ గొడుకుల, సమ్మానితగుణులఁ గనుము జగతీనాథా.

89

దశరథుండు ఋష్యశృంగు నయోధ్యకుం దోడి తెచ్చుట

వ.

అనవుడు సంతోషభరితమానసుం డయి తనగురుం డగువసిష్ఠునిఁ బూజించి
యమ్మునీంద్రుననుమతిం జతురంగబలసమేతుం డయి ధవళచ్ఛత్రచామరంబులు
మెఱయ సచివులుం దాను నెడనెడ నదులు వనంబులు గిరులుం గడచి యంగ
దేశంబు సొచ్చి రోమపాదునిసమీపంబున దీప్తాగ్నియుంబోలెఁ దేజరిల్లుచున్న
ఋశ్యశృంగుని దర్శించి పదంపడి రోమపాదునిఁ బూజించి యతనిచేతఁ దానును
బూజితుండయి తదనుమతి నాఋశ్యశృంగు నతిభక్తి నారాధించి యప్పురంబునఁ
గొన్నిదినంబు లుండి యొక్కనాడు రోమపాదుం గనుంగొని.

90


క.

జనవర నీసుత శాంతను, మునిపుంగవు ఋశ్యశృంగు ముద మారంగాఁ
బని గలిగి పిలువ వచ్చితిఁ, జనవునఁ బుత్తేరవలయుఁ జన నాపురికిన్.

91


క.

అన విని [1]యల్లునిఁ గూఁతుం, జనుఁ డని తగఁ బనిచి యంగజగతీశుఁడు దా
నును దశరథుఁడుఁ [2]గృతాలిం, గనుఁ డయి చన వీడుకొలిపె గాకుత్స్థవిభున్.

92


వ.

అంత నప్పురంబు వెడలి యొక్కదూతుం జూచి నీవు సని నారాక యెఱింగించి
పట్టణం బలంకరింపుఁ డని పౌరులకుఁ జెప్పఁ బొ మ్మంచుఁ బనిచి రయంబున దశర
థుండు నిజపురంబుఁ జేరవచ్చునెడ.

93


ఉ.

లాజలు నక్షతంబులు దళత్కుసుమంబులు మీఁదఁ జల్లి నా
నాజయవాదు లై జనులు నల్గడ మ్రొక్కుచు వేడ్కఁ జూడఁగా
రాజనిభాననల్ మహితరత్నసమాజవిరాజమాననీ
రాజనరాజితో నెదురు రాఁ గడుసొంపున వచ్చి మోసలన్.

94


క.

భీకరతరభేరీఘం, టాకాహళ తూర్యఘోషణములు సెలఁగ న
స్తోకశ్రీకానేకా, నీకంబులు బలసి కొలువ నిజపురి సొచ్చెన్.

95


క.

చొచ్చి యట ఋశ్యశృంగుని, నచ్చుగఁ బూజించి తత్ప్రియాంగన శాంతం
జెచ్చెర నంతఃపురికిం, బుచ్చిన నారాజుసతులు పూజించి రొగిన్.

96


వ.

ఇట్లు శాంతాసహితుం డగుఋశ్యశృంగునకు నుచితసత్కారంబు లొనరించు
చుండఁ బెక్కుదినంబులకుం దనమనోరథం బార వసంతసమయం బాసన్నం
బయిన దశరథుండు.

97


సీ.

అభివందనము సేసి యతిభక్తిఁ బూజించి, ఘను ఋశ్యశృంగుని ననఘ నీవు
పుత్త్రులు నా కింకఁ బుట్టెడునట్లుగా, హయమేధ మొనరింపు మని వరించి

  1. యల్లును గూఁతుం
  2. 'గృతాలింగను లయి' వ్రా. ప్ర.