పుట:భాస్కరరామాయణము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని యి ట్లనేకప్రకారంబుల ముగ్ధాలాపంబు లాడుచుం దమలోఁ గలసి యునికిఁ
బరికించి.

77


క.

ఒడ లెంతయుఁ బులకింపఁగఁ, బుడుకుచు మేలముల మోసపుచ్చుచు నమ్మై
[1]బెడఁగుసిలుగులం బెట్టిరి, పడఁతుక లాఋశ్యశృంగుఁ బార్థివముఖ్యా.

78


వ.

ఇ ట్లమ్ముగ్ధతపోధనుం దమవలలకు లోఁబఱిచి యచటం దడయ వెఱచి పురంబు
నకుం జని రంత ఋశ్యశృంగుండును జింతాకులమానసుం డయి తిరుగుచు
నెప్పుడు వీరు వచ్చెదరో యనుచు వారు వోయినత్రోవన వారిరాక కెదురుచూ
చుచు నుండ నమ్మఱునాఁడు.

79


క.

మణిఘృణిగణయుతరశనా, ఝణఝణితాగణితరణితచరణాంచితభూ
షణఘోషణరణనవిచ, క్షణకంకణకింకిణీకఝంకృతు లారన్.

80


ఉ.

అంగన లేఁగుదెంచి ముద మారఁగఁ గాంచి రధీతవేదవే
దాంగుని సర్వసంయమిముఖాబ్జపతంగుని నిర్జితేంద్రియా
సంగుని లిప్తభూతిలసదంగుని సద్గుణసంగునిన్ వ్రతా
భంగుని [2]సంతతోదితతపఃకృతిచంగుని ఋశ్యశృంగునిన్.

81


క.

కనుఁగొని మునిపుంగవ మా, వనమున కేతెంతు గాక వరదుఁడ వై నీ
వనవుడు ననుమతి సేసిన, వనితలు సంతసముఁ బొంది వాంఛలు సెల్లన్.

82


ఉ.

మచ్చికఁ గౌగిలించి పలుమాఱుఁ గుచంబుల నెత్తి యొత్తుచున్
మెచ్చుగ ముద్దు లిచ్చుచును మేలము లాడుచు బాహుపాశముల్
సెచ్చెరఁ గంఠలగ్నములు సేయుచు మోహితుఁ జేసి నేర్పుతోఁ
దెచ్చిరి దీమముల్ మృగముఁ దెచ్చినకైవడి ముగ్ధసంయమిన్.

83


క.

పురమున కమ్మునిఁ దేరఁగ, నురుతరవర్షములు గురిసె నుర్వీశుఁడు స
త్వరగతి నెదురుగఁ జని యా, దరమునఁ గొని వచ్చి యిచ్చెఁ దనసుత శాంతన్.

84


వ.

తగ నిచ్చి బహుప్రకారంబుల మన్నించి.

85


క.

[3]తనయల్లునిఁ దనకూఁతుం, దనయింటనె యునిచికొని ముదం బందుచు న
మ్మునివరునిప్రసాదమ్మునఁ, దనయులఁ గని యున్నవాఁడు తద్దయు మహిమన్.

86


ఉ.

కావున రోమపాదమహికాంతునిపాలికి వేగ మేఁగి సం
భావన లాచరించి తగ మైత్రి యొనర్చి ప్రియంబుతోడ న
బ్భూవరు నీవు వేఁడికొని పుణ్యచరిత్రు బహుక్రియాకలా
కోవిదు ఋశ్యశృంగు నిటకుం గొనివచ్చి [4]మనోహరంబుగన్.

87


తే.

పుత్రకామేష్టి సేయించి పుణ్యమహిమఁ
దగినపుత్రులఁ బడయుము దశరథేశ

  1. బుడికి జిడుంగులఁ గట్టిరి. వ్రా. ప్ర.
  2. సంతతోదితతపఃకృతభంగుని; సంతతోర్జితతపఃకతృచంగుని; సంతతోద్ధితతపఃశ్రుతిచెంగుని
  3. తనయల్లును దనకూఁతుం
  4. మనోరథంబుగన్