పుట:భాస్కరరామాయణము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నధరమరీచులు హస్తరోచులుఁ గ్రమ్మి, వరశాఖులకుఁ బల్లవములు గాఁగ
[1]రుచిరదృష్టిప్రభల్ కచరుచులుఁ బొదలి, కాంతారమునఁ దేఁటిగములు గాఁగ
సుకుమారతనువులు సురుచిరబాహులు, [2]బలసి కానకు లతావలులు గాఁగ
వారకామిను లాపుణ్యవనము సొచ్చి, మధురమంజులరవముల మనము లింప
రాగములు సేసి పాడుచు [3]రమణ వచ్చి, ఋశ్యశృంగుఁడు మెలఁగెడువృక్షవాటి.

65


వ.

చెంతల నిలిచి కెలంకులఁ బరికించునెడ.

66


చ.

వరముని ఋశ్యశృంగుఁ డట వచ్చిన వారివిచిత్రమూర్తు ల
చ్చెరువడి చూచుచుం జెవులు సేరిచి గానము వించు నుండె న
త్తరుణులుఁ జేరి యోపరమతాపస యోమునిపట్టి యేల యొ
క్కరుఁడవుఁ జొచ్చి యీవిజనకాననభూమిఁ జరించె దీ వనన్.

67


క.

వినుఁ డేఋగ్యజ్ఞాంగుం డనుపేరను ఋశ్యశృంగుఁ డనియెడునామం
బున మహిలోఁ బరఁగుదు మ, జ్జనకుండు విభండకాఖ్యసంయమి యొప్పున్.

68


వెలయఁగ వచ్చినార లిట వింతతపస్వులు మీరు మాననీ
యులు మిముఁ బూజ సేసి సుకృతోన్నతిఁ బొందెద నంచు నిష్ఠతోఁ
దలకొని యర్ఘ్యపాద్యములు దర్భలు నాదట నిచ్చి యోలిమై
ఫలములు కందమూలములు భక్తి నిడం గొని వారు నవ్వుచున్.

69


క.

అమృతరుచు లారఁ బాకము, లమరించిన మోదకంబు లాదిగ బహుభ
క్ష్యము లొగి నిచ్చిన నానం, దముతో నందుకొని నమలి తనిసినమదితోన్.

70


క.

ఈపగిదిఫలము లెన్నఁడు, నేపొలములఁ దరులఁ గాన మెందులు వివి యీ
తీపులు నిట్టివిచిత్రపు, రూపులు నీఫలము లింతరుచ్యము లగునే.

71


వ.

అని పలుకుచు నమ్మగువలు వీనులు సొగియింపం బాడ నగ్గానంబు విని విని
యెలమిని.

72


క.

ఈమధురస్వరవేదం, బే మెన్నఁడు వినము మీకు నేముని సెప్పెన్
వేమఱు మీతోఁ జదివెద, నోమునివరులార చెప్పుఁ చొప్పున నాకున్.

73


క.

అని పలికి మఱియు నమ్ముని, తనముందట నిలిచి యున్న తరుణులవృత్త
స్తనములు హారంబులుఁ జం, దనచర్చలుఁ బోలఁ జూచి తగ ని ట్లనియెన్.

74


ఆ.

నాకుఁబోలెఁ గావు మీ కురంబున రెండు, వలుఁదగుజ్జుఁగొమ్ము లలరుచున్న
[4]వఱుతి తులసిపూస లతిసితములు మేనఁ, దనర నలఁదినారు తావిభూతి.

75


క.

[5]ఈకట్టినవల్కలములు, మీ కెంతయు లెస్స లింతమృదువులు గలవే
యేకుజములనారలొ యివి, మాకును నివి యొసఁగవలయు మానుగ మీరల్.

76
  1. రుచిదృష్టులుఁ గచరుచులును బొదివి కాంతారమునకుఁ దేఁటిదాఁట్లు గాఁగ
  2. బెరసి కొనకుఁ దీఁగతురుము గాఁగ
  3. రమణ ఋశ్య, శృంగుమెలఁగెడిచెంతలఁ జెలులు నిలిచి.
    వ. కెలంకులఁ బరికించునెడ.
  4. వలఁతి తులసిపూస లతిశీతలంబులు, దనర
  5. 'మీకట్టిన వల్కలములు, మేకెంతయు' నని యే