పుట:భాస్కరరామాయణము.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

మలయమారుతంబు మర్కటాంగముల కిం, పారఁ బొలసి చెమట లార్చుచుండ
భానుదీప్తు లడర బయ లీక మేఘముల్, నీడ సేయుచుండ నిలిచి నిలిచి.

270


ఉ.

చెందిననేదలం దృణము నేయుచు సేతువు గట్టి కట్టి మ
ధ్యందినవేళ నూఱటల కాసలు సేయుచు వాడుమోములుం
బొందుపడంగ సాంద్రతరభూరుహపంక్తులచల్లనీడలం
గందఫలాదిఖాద్యములు గైకొని కొండొక నిల్చి వెండియున్.

271


ఉ.

దట్టముగా ధరాధరవితానము లొడ్డుచు మీఁద మ్రాఁకులున్
మట్టలు వైచి కప్పుచు సమస్థలి సేయుచు సూత్ర మోజకుం
బట్టుచుఁ దెట్టియ ల్దరులు బల్పుగఁ జేర్చుచుఁ గట్ట రాపడన్
మట్టుచు యోజనార్ధశతమాత్రము గట్టిరి నాఁడు వానరుల్.

272


ఉ.

అంతఁ బయోజబంధుఁ డపరాబ్ధికి దక్షిణసింధుబంధవృ
త్తాంతము సెప్ప నేఁగినక్రియం జనఁగాఁ గపిరాజునాజ్ఞ
పంతయుఁ గట్టివైతము సురారులదర్పము దీర్త మంచు వి
శ్రాంతు లొనర్ప నాత్మశిబిరంబులకుం జనుదెంచి రయ్యెడన్.

273


ఉ.

కంటికిఁ గూర్కు లేక దశకంఠునిచేఁ బడులోక మింక ని
ష్కంటక మయ్యె నా నుదధిఁ గట్టఁగఁ దా నటఁ బంచె రాముఁ డి
[1]ట్లొంటక కాదు బెగ్గిలకుఁడో యని వేల్పులు పాట నెత్తుజే
గంటతెఱంగునం బొలిచెఁ గైరవబంధుఁడు బంధురద్యుతిన్.

274


ఉ.

ఆసమయంబునం గువలయప్రియుఁ డల్లనఁ జల్లగాలికిన్
బాసట యై శరీరములపై నటు లూనిన సేతుబంధనా
యానపరిశ్రమంబు నిబిడామలచంద్రికఁ బాయఁజేయ ని
ద్రాసుఖసక్తు లౌచుఁ బ్రమదం బలరార బలీముఖోత్తముల్.

275


సీ.

కలలోనఁ గొఱఁతకుఁ గులపర్వతంబులు, దెచ్చి [2]కట్టితి మని మెచ్చువారు
లంక సొచ్చితి మంచు హుంకారములు సెల్ల, గలవరించుచు బిట్టు తెలియువారు
వీచులతాఁకున నేచునర్ణవరవ, మడఁగి పోవఁగ గుఱు పొడుచువారు
నిద్రమైఁ బెకలించు నద్రులగతిఁ దోఁపఁ, జూచి చేతులు బయ లూఁచువారు
గాల రాచువారు వేలంబుచుట్టును, దిరుగువారు గట్ట యరయువారు
నిదుర లుడిగి తరణి కెదురుసూచుచు నుండు, వారు నగుచు రజని [3]పూరగింప.

276


ఉ.

తమ్ములలోన నీవు నొకతమ్ముఁడ వంచు విరోధితమ్మునిం
దమ్ముని నింద్రనందనునిదమ్మునిఁ జూచినచూపుఁ జూచెఁ గ్రొ
త్తమ్ములతమ్ము లైనకనుదమ్ముల నవ్విభు మేలు సూచుచుం
దమ్ములఁ జూతు నన్కరణిఁ దమ్ములవిం దుదయాద్రి దోఁచినన్.

277
  1. ట్లొంటికిఁ గాదు
  2. సేతువుఁ గట్టి మెచ్చువారు
  3. పూరణింప