పుట:భాస్కరరామాయణము.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జంపి కా కే నయోధ్యకుఁ జనితినేని, [1]దశరథేశునడుగులకుఁ దప్పినాఁడ.

188


క.

అనుడు ముద మంది వినయం, బున మోడ్పుంగేలు మౌళి మోపి యతం డి
ట్లను నోపినయ ట్లేనును, జనవర సమయింతు నన్నిశాచరుసేనన్.

189


వ.

అనిన సంతోషించి రామచంద్రుండు లక్ష్మణుం గనుంగొని నీవు సముద్రోదకం
బులు దెచ్చి లంకారాజ్యంబునకు విభీషణు నభిషేకంబు సేయు మని నియోగించె
నానమయంబున సుగ్రీవుం డి ట్లనియె.

190


చ.

అనఘచరిత్ర మీకు శరణాగతరక్ష కులవ్రతంబు మీ
సునిశిత బాణజాలముల చోఁకున కోర్వక వచ్చి తా దశా
ననుఁ డభయంబు వేఁడికొనినం దగ వె ట్లగు నన్న నవ్విభుం
డినసుతుఁ జూచి య ట్లయిన నిచ్చెద వాని కయోధ్య నావుడున్.

191


తే.

అఖిలవానరవీరులు నయ్యనుగ్రహంబు గొనియాడి రంత నయ్యధిపునాజ్ఞ
నట్లు సౌమిత్రియును రాక్షసాధిపత్య, మునకు నభిషిక్తుఁ జేసె నిం పెనయ నతని.

192


వ.

ఆసమయంబున సుగ్రీవహనుమంతు లవ్విభీషణుం జూచి సేనాసహితంబుగా ని
న్నరేంద్రున కంబుధి గడచుతెఱం గెత్తెఱంగునం గల్గు నీమతం బెఱింగింపు మ
నిన నతం డి ట్లను రామచంద్రుండు సముద్రప్రార్థనంబు సేసి లంకపై నరుగునది
కార్యంబు నావుడు వార లవ్వాక్యంబులు విన్నవించిన రఘువరుండును లక్ష్మణా
నుమతంబున నొక్కరమ్యప్రదేశంబున నుదధిం గూర్చి నియతుం డై యుండె నం
త శార్దూలుం డను వేగులవాఁ డింతయుం జూచి పోయి రావణున కి ట్లనియె.

193


క.

దేవ విభీషణుఁ గడు సం, భావించి నిశాచరాధిపత్యమునకు నా
భూవల్లభుఁ డభిషిక్తుం, గావించెం బయోధి దాఁటఁ గలఁ డిటమీఁదన్.

194


క.

వనచరసేనయు శతయో, జనవిస్తారంబు గలిగె జలనిధి కీ డై
పెనుపొందుచు నేదెసఁ జూ, చిన నరుదు భయంబుఁ జేయుఁ జిత్తంబునకున్.

195


క.

రాఘవులును రణవిజయ, శ్లాఘాయుతు లసమసత్త్వసంపన్ను లురు
జ్యాఘాతకఠినబాహు ల, మోఘశిలీముఖులు సమరముఖవికచముఖుల్.

196


వ.

కావున సామభేదదానంబులలో నొక్కతెఱంగు సేయునది కార్యం బనిన నద్దశ
ముఖుండు శుకుం డనువానిం గనుంగొని.

197

రావణుఁడు శుకుం డనుదూతను బంపుట

శా.

సుగ్రీవుం డనువాఁడు మర్కటభటస్తోమంబుతో దుర్మదో
దగ్రక్రోధముఁ బూని రామునకుఁ దో డై వచ్చుచున్నాఁడు గ
ర్వగ్రస్తుం డతఁ డీవు వే చని వృథావైరంబు నీ కేల పం
క్తిగ్రీవుం [2]డురునో నరుం డురునొ బుద్దిం జూడుమా యేర్పడన్.

198


వ.

అని పల్కి నావచనంబులుగా వెండియు ని ట్లనుము.

199
  1. దశరథేశ్వరునానకుఁ దప్పినాఁడ
  2. డురవో నరుం డురవొ బుద్ధిం