పుట:భాస్కరరామాయణము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

రామునిజన్మంబు రమణీయశీలంబు, కౌశికాగమనంబు కార్ముకంబు
చేవఁ ద్రుంచుటయును సీతావివాహంబు, భార్గవరఘురామభాషణములు
రామాభిషేకంబు రాజ్యవిఘాతంబు, రాముప్రవాసంబు ప్రజలవగపు
దశరథుశోకంబు ధరణీశుమరణంబుఁ, దనర భరద్వాజుదర్శనంబు


తే.

చిత్రకూటప్రవేశంబు సేయుటయును
భరతుఁ డేతెంచుటయు ధాత్రివరుఁడు దెగుట
విని జలక్రియచేఁతయు ననుజు భరతు
మగుడఁ బుచ్చుటయును నంత మనుజవిభుఁడు.

22


వ.

మఱియు దండకారణ్యగమనంబును విరాధువధమును శరభంగుదర్శనంబును
సుతీక్ష్ణసమాగమంబును ననసూయావలోకనంబును నంగరాగార్పణంబును శూ
ర్పణఖావివాదంబును జుప్పనాక విరూపినిం జేయుటయును ఖరదూషణత్రిశిరుల
మరణంబును రావణురాకయును మారీచువధమును సీతాహరణంబును రామువి
లాపంబును జటాయువధంబును గబంధుదర్శనంబును బంపావలోకనంబును ఋశ్య
మూకగమనంబును సుగ్రీవసమాగమంబును సుగ్రీవసఖ్యంబును వాలిసుగ్రీవవి
గ్రహంబును వాలిప్రమథనంబును సుగ్రీవుపట్టంబును దారావిలాపంబును వర్షా
కాలనివాసంబును రామునికోపంబును గపిబలంబులం గూర్చుటయును సీతా
న్వేషణంబు సేయఁ గపినాయకుల దిక్కులకుం బుచ్చుటయును నంగుళీయకదానం
బును గపులప్రాయోపవేశంబును సంపాతిం గాంచుటయును సముద్రలంఘనం
బును మైనాకదర్శనంబును సింహికం గనుటయు [1]సువేలాచలదర్శనంబును లంకా
ప్రవేశంబును లంకినీదర్శనంబును బానభూమిగమనంబును నవగోధదర్శనంబును
నశోకవనికాయానంబును సీతాదర్శనంబును రావణదర్శనంబును రామాదులవృ
త్తాంతంబు సీత కెఱింగించుటయును సీత యానవా లిచ్చుటయును వనభంగంబును
రాక్షసులం దోలుటయును గింకరనిబర్హణంబు నక్షవధమును వాయుసూనుండు
పట్టువడుటయు రావణుదర్శనంబును లంకాదహనంబును [2]మగుడ మహోదధి
దాఁటి మధువనంబు సొచ్చుటయు రాఘవదర్శనంబును రామునకు మణి యిచ్చుట
యును సముద్రసమాగమంబును సేతుబంధనంబును [3]విభీషణునాగమనంబును
రాక్షసవధోపాయంబుఁ జింతించుటయును గుంభకర్ణమేఘనాదనిధనంబును రా
వణయుద్ధంబును దన్మరణంబును సీతాప్రాప్తియును విభీషణాభిషేకంబును బుష్ప
కాధిరోహణంబును నయోధ్యకు మరలి వచ్చుటయును భరతసమాగమంబును
రామాభిషేకంబును సైన్యంబుల వీడుకొలుపుటయును రామునిరాజ్యంబును
నుత్తరకాండకథయునుం గూడ నేడుకాండంబులు నేనూఱుసర్గలు నిరువది

  1. లంకావలయదర్శనంబును
  2. మగుడ సీతం గాంచుటయు మహోదధి
  3. విభీషణసంగమంబును