పుట:భాస్కరరామాయణము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నాలుగువేలశ్లోకంబులునుగా వాల్మీకిమునీంద్రుండు రామాయణమహాకావ్యంబు
సెప్పెం దత్కథాభ్యుదయం బెట్టు లనిన.

23

అయోధ్యాపురవర్ణనము

క.

సరయువుతీరంబున బహు, తరధనధాన్యములు గలిగి ధరణికిఁ దొడ వై
పరఁగెడుకోసలదేశం, బరుదారఁగ మెఱసి యుండు నద్దేశమునన్.

24


క.

అమరఁ ద్రియోజనవిస్తీ, ర్ణము దగఁ బండ్రెండుయోజనంబులనిడు పై
కొమరారునయోధ్యానగ, రము మును నిర్మించె మనువు ప్రాభవ మొప్పన్.

25


ఉ.

దానులు రాజ్యవర్ధనులు దత్త్వవిచారు లుదారు లింగిత
జ్ఞానులు మంత్రకోవిదులు సత్యవచస్కులు విద్విషత్తమో
భానులు ధీయుతుల్ చతురుపాయసమర్థులు రాజకార్యసం
ధానపరాయణుల్ వినయతత్పరు లాపురి మంత్రు లెంతయున్.

26


క.

స్వామిహితశక్తిమంతులు, ధీమంతులు చండధామదీధితిమంతుల్
భీమాహవభుజవిజయ, శ్రీమత్కృతిమంతు లాపురిని సామంతుల్.

27


చ.

దురితహరుల్ స్వకర్మనిరతుల్ విజితేంద్రియు లంచితవ్రతుల్
సరసులు సత్కళావిదులు శాస్త్రమతజ్ఞులు సద్గుణాకరుల్
సురుచిరపుణ్యు లవ్యయులు సూనృతవాదులు చిత్ప్రదీపని
స్తరితబృహత్తముల్ సుజనసత్తము [1]లప్పురి భూసురోత్తముల్.

28


చ.

తరళితదంతకాంతి సముదంచితబృంహితనీలదేహముల్
పరఁగఁ దటిల్లతాస్తనితభాసురవారిధరంబులో యనం
బొరిఁబొరి నేనుఁగుల్ దిరిగి పుష్కరశీకరదానధార ల
ప్పురమునఁ బెల్లుగాఁ గురియు భూతల మంతయుఁ బంకిలంబుగన్.

29


చ.

జవమున భంజళిన్ మురళిఁ జౌకమునన్ [2]నడనైదుధారలన్
వివిధవిచిత్రవల్గనవివేకములన్ బొలపంబునన్ శుభ
ధ్రువముల దూరభావముల రూపబలంబుల రూఢి కెక్కి యా
హవజయశీలముల్ గలుగు నశ్వము లెన్నఁగఁ బెక్కు లప్పురిన్.

30


చ.

అలఘుతరప్రభావమున నంతకుఁ దేజమునన్ దివాకరున్
బలమున శేషునిం గడిమి భార్గవరాముని వైభవంబునన్
బలరిపు సాటి సేయఁ దగి బాహుబలార్జితశత్రుమండలో
జ్జ్వలధనవంతు లై మహిమ [3]వాలుదు రప్పురి రాజస త్తముల్.

31


చ.

కులగిరు లెత్త నైన వడిఁ గుంభినిఁ గ్రుంగఁగ ద్రొక్క నైన వా
ర్ధులఁ గలఁపంగ నైన జము దుప్పలు దూలఁగఁ దోల నైన ది

  1. లందుల భూసురోత్తముల్
  2. నడభేరిఢాకలన్
  3. వ్రాలుదు రందుల రాజవర్గముల్