పుట:భాస్కరరామాయణము.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధనములు నఖిలసుఖంబులు, మన మారం గాంతు రొలి మర్కటు లెల్లన్.

766


వ.

అని పెక్కుభంగులం బలుక నఖిలవనచరులు నతనిపలుకుల కిచ్చగింపక ఱిచ్చవడి
యున్న మఱియు నావనచరయూథపులం గనుంగొని.

767


చ.

జనపతి సీత కి మ్మనుచు సమ్మతి ముద్రిక యీఁడె లంకలో
జనకజఁ జూచి రం డనుచు సారసబంధుసుతుండు పంపఁడే
పనివడి లంకఁ జొత్తు మని [1]పైబడి తా రిట వచ్చి యిప్పు డీ
వననిధిఁ జూచి భీతిగొని వానరు లూరక యుండఁ బాడియే.

768

అంగదాదులు సముద్రంబు దాఁటఁ దమకొలందు లెఱింగించుట

వ.

ఇంక మీర లీసముద్రంబు దాఁట సమర్థులు గారె వనచరపుంగవులగు దృఢ
పరాక్రములరు నభంగగమనులరు నతిప్రఖ్యాతులరు మీ రెంతంతమేర సముద్రం
బు దాఁట నోపుదురు చెప్పుఁడు.

769


సీ.

అని యంగదుఁడు పల్క నగచరవీరులు, దమతమసత్త్వముల్ దలఁచిచూచి
గజుఁడు యోజనదశకంబు గవాక్షుఁ డ, త్యుద్ధతి నిరువదియోజనములు
శరభుండు గడఁకఁ ద్రింశద్యోజనంబులు, ఋషభుఁ డన్కపివీరుఁ డేపుతోడ
నలువదియోజనములు గంధమాదనుఁ, డోపిక నేఁబదియోజనములు
నురుగతిని మైందుఁ డఱువదియోజనములు, నోజ ద్వివిదుండు డెబ్బదియోజనములు
నురవడిని దారుఁ డెనుబదియోజనములు, జలధి దాఁటఁగఁ గల మని పలికి రపుడు.

770


వ.

అ ట్లందఱు కపులుఁ బలుక వారలం జూచి మారుతసమానవేగుండును ధార్తరా
ష్ట్రసమజవాధికుండును నతిప్రాజ్ఞుండును శతవృద్ధును నైనజాంబవంతుండు నా
పూర్వవృత్తాంతంబు వినుం డని యి ట్లనియె.

771


క.

గరుడుఁడు పుట్టనికాలము, సుర లమృతము ద్రచ్చుటయును సురలును దైత్యుల్
దురములు గావించుటయును, బరువడిఁ గన్నాఁడ మున్ను బహువారంబుల్.

772


వ.

అట్లు గాన బహుకాలంబునాఁటివృద్ధను జవసత్త్వంబు లడంగియున్నవాఁడఁ
బిన్ననాఁటిబలపరాక్రమంబు లిప్పుడు చెప్ప వచ్చిన మహాహాస్యాస్పదం బై యుం
డు నైనం జెప్పెద నాకర్ణింపుఁడు.

773


సీ.

విక్రమం బెసఁగఁ ద్రివిక్రమదేవుండు, విక్రమత్రయమున విశ్వధరయు
మేదురగతి [2]నాక్రమించినప్పుడు భక్తి, యమర నాఱుప్రదక్షిణములు చేసి
వరుస సుషేణుతో నిరువదియొకసారె, లీలఁ బ్రదక్షిణ మోలిఁ జేసి
సురలకు మునులకుఁ జోద్యంబుఁ బ్రీతియు, నమరించితిని బలియజ్ఞవేళ
నిచ్చ నోషధుల్ నాచేతి కిచ్చునప్పు, డమరులను వేఁడి త్రాగితి నమృత మేను

  1. పైఁజులతో నిట వచ్చి
  2. నాక్రమించిన యామితి, కమర