పుట:భాస్కరరామాయణము.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

హిమనగమునందు మలయో, త్తమశృంగముచెంత నాసదన మున్నది నా
రమణియు నానందనుఁడును, నమరఁగ నున్నారు గాన యరిగెద నటకున్.

749


వ.

అని పలుక జాంబవంతుండు సంపాతిం గనుంగొని నీవు రామహితంబును మ
ద్వాంఛితంబు నైనసీతావృత్తాంతంబు చెప్పితి సంతసంబునఁ బొందితి మింక సము
ద్రోల్లంఘనం బెట్లు సేసెదమో యనుచింతం జింతిల్లుచున్నార మివ్వనధి దాఁట
నీవును సహాయంబు గావలయు నన్న సంపాతి జాంబవంతున కి ట్లనియె.

750


క.

వృక్షచరులార బలజవ, దక్షత నీయంబురాశి దాఁటం జాలం
బక్షములు గలిగి యున్నను, రక్షోనాయకున కెదిరి బ్రదుకఁగ నోపన్.

751


తే.

కాన నాసుతుఁ బంచెద ఘనుఁడు వాఁడు, శంక లే కంబునిధి దాఁటి లంకఁ జొచ్చి
సీతఁ బొడగాంచి కృతకార్యసిద్ధుఁ డగుచు, వచ్చు నిట కంచుఁ దనపుత్రు వాంఛఁ దలఁప.

752


క.

ఎఱకలగాలిం దరువులు, నఱుముగ విఱిగి కుసుమములు నలుగడ రాలన్
నెఱి చెడి వడి మేఘంబులు, పఱవఁగఁ దండ్రికడకును సుపార్శ్వుఁడు వచ్చెన్.

753


క.

వచ్చి తను నచటివానరు, లచ్చెరువడి చూడఁ దండ్రి కతఁ డిట్లను నీ
విచ్చఁ దలంచిన నిటకున్, వచ్చితి నేమిపని చేయవలయుం జెవుమా.

754


వ.

అనిన సంపాతి తనయునకు నంతవృత్తాంతంబును జెప్పి సీతం జూచి రమ్మని పనుప
నతం డెంతయు సంతోషించి యంగదుం గనుంగొని.

755


క.

పారావారము దాఁటెద, నారావణులంకఁ గొంక కద్భుతసత్త్వో
దారతఁ జొచ్చెద వచ్చెద, నారామునిదేవిఁ జూచి యతిశీఘ్రముగన్.

756


[1]అని పలుక నతనికడంకకు సంతోషించి యంగదుఁ డతనిం జూచి సుపార్శ్వా నీ
వధికబలుండ వెంతటికైనం జాలుదు మీ తండ్రియు నీవును నెమ్మది సుఖంబున
నుండుండు మీ రాయాసపడవలవదు సీత లంకలో నున్న దని మున్ను మీ
తండ్రి దివ్యదృష్టిం జూచి చెప్పినప్పుడు మా కత్యంతసహాయసంపన్నత్వంబు మీ
రు చేసినట్టి దయ్యె మే మవలీల సముద్రంబు దాఁటి లంకఁ ద్రికూటాచలంబు
తోఁ బెఱికి పేటాడం జాలుదు మిట మహావీరవానరులు విష్ణురుద్రపరాక్ర
ము లైనమహాకపికోటులు నున్నారు మే మింక సముద్రలంఘనగమనోద్యోగం
బు సేసెద మని పలుక విని సంపాతియు నధికజవంబున మింటికి నెగసె నా
సమయంబున.

757
  1. వ. అని పలుక నంగదుండు సుపార్శ్వుం జూచి నీ వధికబలశాలి వవార్యవేగుండవు నగుదు నీవాక్యంబులకు సంతోషించితిమి మాతండ్రియు నీవు నెమ్మది నుండుఁడు మున్నె యేము విన్నారము సీత లంకలో నునికి నవలీల సముద్రంబు దాఁటి లంకఁ ద్రికూటాచలంబుతోడం బెఱికి పేటాడం జాలుదుము...పా.అ.