పుట:భాస్కరరామాయణము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రునితండ్రి యగుబుద్ధయ రంగనాథరామాయణకర్తగా నున్న గోనబుద్ధరా జందురు. అప్పు డుత్తరరామాయణమును ద్విపదగా రచించిన యితనికొడుకులు విఠలరాజును గాచవిభుఁడును సాహిణికిఁ దోఁబుట్టువులు కావలయును. సాహిణి తనతండ్రియుఁ దోఁబుట్టువులును రామాయణమును రచించియుండఁగాఁ దా నేల యారామాయణమును రచింపింపవలసెనో తెలియరాకున్నది. దీనినిబట్టి చూడఁగా 'మారయకుమార' యనుచోఁగల కుమారరుద్రుతండ్రి మారయ, సాహిణిమారుఁ డగుట సందిగ్ధముగా నున్నది. యుద్ధకాండముకడమను బూరించినయయ్యలార్యుఁడు తుదను శివునే సంబోధించియున్నాఁడు. ఇతఁడును దాను బూరించిన యుద్ధకాండముతొలుత సాహిణిమారునిసంబోధన ముండియుఁ, దాను దుదను శివునే సంబోధించుటంబట్టియు 1134 పద్యముకడ ' ఈఘట్టమువఱకు హళక్కిభాస్కరకవివిరచితము. ఇది మొదలు వేదగిరి నాయనింగారిప్రేరణమున నయ్యలార్యుఁడు రచించినది' అని వ్రాతప్రతులం దెల్ల నుండుటంబట్టియు, నతఁడు సాహిణిమారనకాలమువాఁడు గాఁ డని తెలియుచున్నది. మఱియు నితనిగద్యమున 'శ్రీ శాకల్య మల్లకవి రవిరాహు నృసింహావరజాప్పలార్య వరసుత' యని యున్నది; కాని భాస్కరమిత్రుఁడని కానిపింపదు, మఱి వేదగిరినాయనిప్రేరణముననే యితఁ డీగ్రంథమును రచించెనుగాని భాస్కరకవితోడి మైత్రింబట్టి కాదు; కాన యితఁడు భాస్కరమిత్రుం డనుటకు నుపపత్తిలేదు. ఇవియన్నియు భావిపరిశోధనమునంగాని యిప్పుడు తెల్లము గాకున్నది. కాన యిదమిత్థ మ్మని నిర్ణయింప నింతకు నయితి లేదు.

ఆరణ్యకాండమున 'శ్రీరామాకుచయుగళీహారిద్రోల్లసితవక్షహరిచరణ' యని యున్నది. ఇందు, వక్షశ్శబ్ద మకారాదివలె సమాసమున నుంపఁబడియున్నది. మఱియు 'హరిహరవేధాదులకు' (2. ఆ. 33. ప.) ననియు వేదశ్శబ్దము నకారాదివలెనే సమాసమున జూపట్టుచున్నది. ఏతద్దోషసామ్యమునుబట్టి కృతిపతిసంబోధనకర్తయే కాండమునకుఁ గూడ కర్త యగు నని నిర్ణయింపఁ దగియున్నది. ఇవియన్నియు నట్లుండ, నారణ్యకాండమున వ్రాతప్రతులఁ జూపట్టుపాఠము మిక్కిలియు సంగ్రహముగా నుండ నచ్చుప్రతులందలి పాఠ మ దేమి కారణమో యంతకంటెఁ జాల నధికముగాను బెక్కుచోట్ల మిక్కిలియు భిన్నముగాను జూపట్టుచున్నది. కొన్నిచోట్ల వ్రాతప్రతులయొక్క పద్యమునకు నచ్చుప్రతులం బెక్కుపద్యములు చూపట్టుచున్నవి. అచ్చుప్రతులం గానిపించు నధికపద్యములుగాని భిన్నపద్యములుగాని మాకు దొరకినన్ని వ్రాతప్రతులందును బ్రాచ్యలిఖితభండారమందలి ప్రతులందును గానిపింపవు. ఈగ్రంథమును దొలుత ముద్రణము గావించినకరాలపాటి రంగయ్యగారు మంచికవి యగుటచే సంగృహీతములుగాను గ్రంథపాతములుగాను నున్నయెడల సొంతకవనముచేఁ బెంచియుఁ బూరించియు నుందురేమో యని సందేహము గలుగుచున్నది. మంత్రిభాస్కరునిదా హళక్కిభాస్కరునిదా