పుట:భాస్కరరామాయణము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యని వివాదగ్రస్తమై యున్న యీయారణ్యకాండపుఁగవనము మొదలే చాలభాగము మఱియొకకవిదిగా దోఁచుచున్నది.

ఒక యారణ్యకాండముననే కాదు; అయోధ్యాకాండముతుదను గూడ 273వ పద్యము మొదలుకొని 324వ పద్యమువఱకు వచ్చు ప్రతులం గల పాఠము వ్రాఁతప్రతులం గానరాదు. ఆపాఠమున కెల్ల మాఱుగా వ్రాఁతప్రతులందు,

సీ.

అంత నక్కడ రాముఁ డచటికి భరతుండు, క్రమ్మఱ వచ్చి సామ్రాజ్యమునకుఁ
దన్ను రమ్మనుచుఁ బ్రార్థన సేయునో యని, చింతించి యాత్మలోఁ జిత్రకూట
మున నల మునిజనంబుల వీడుకొని మార్గ, తరువీక్షణంబునఁ గరము వేడ్క
దనర సీతాసుమిత్రాపుత్రసహితుఁ డై, దండకావనమహీస్థలికి నరిగె
ననఁగ నీయయోధ్యాకాండ మభిమతముగ, వినిని వ్రాసినఁ జదివిన విస్తరించి
చెప్పినను వారలకు సుఖసిద్ధి యెసఁగు, సంపదాయురారోగ్యముల్ సంభవించు.

నని యొక్కసీసపద్యమే యున్నది. ఇందుఁ గలకవులకవనమంతయు రసవంతమును మధురమునుగానే యున్నది. అందు భాస్కరునికవనము ప్రౌఢము. మల్లికార్జునుని కవనము వీరభయానకరసములం దందఱకవితకంటె నొకవన్నె యెక్కుడనవచ్చు. కవిత్రయముచే నవ్యయములుగాఁ బ్రయుక్తము లగు 'అట ఇట ఎట' యనునవి యిందు విశేష్యములుగాఁ జూపట్టు చున్నవి. [1]అయ్యలార్యునికవనమున ఋకారమున కుత్వముతోను దన్మిత్రములతోను యతిమైత్రి గానిపించెడిని.

ఈ భాస్కరుని హళక్కిభాస్కరుఁ డందురు. ఇటీవల హుళిక్కిభాస్కరుం డని గ్రంథములం దితని వాడుచున్నను బ్రాఁతవ్రాఁతప్రతులందు హళక్కి యనియే యున్నది. ఈ యుపపదము వచ్చినవిధ మె ట్లన, భాస్కరునింటిపేరు మొదట 'మంగళపల్లి' యఁట . ఇది యిట్లుండ నొకనాఁ డితని కాశ్రయభూతుఁ డయినరాజు రత్నఖచిత మగుబంగారుపళ్లెరమున నమూల్యాభరణాదికలితం బగు కర్పూరతాంబూలము నిడి యొక్కుడురసవంతముగాఁ గవిత్వము చెప్పుకవికి నమూల్యమయిన యావిడియము నిచ్చెద నని చెప్పినట్లును, భాస్కరుఁ డందఱికన్న నతిశయముగాఁ గవిత్వమును జెప్పి యాయగ్రతాంబూలము నందినట్లును, దానం చేసి భాస్కరునికిని దర్వాతఁ దత్సంతతివారికిని హళక్కి యనునుపపదము గలిగె ననియు, నిప్పటికిని దద్వంశీయులచేఁ జెప్పఁబడుచున్నదఁట. ఇది నిజముగా నుండవచ్చును. హళక్కి యనఁగాఁ గన్నడమునఁ దాంబూల మని యర్థము సామాన్యముగాఁ దెనుఁగున బిరుదులందుఁ గన్నడపదములను గౌరవార్థ ముంచుకొనుట చూపట్టుచున్నది. ఇందలితప్పులొప్పులను దెలుప నెల్లరును బ్రార్థితులు.

తం. తే.

  1. చూడు 575 పుట