పుట:భాస్కరరామాయణము.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

అన్నా లక్ష్మణ నిన్నుఁ బుణ్యనిధి నే నజ్ఞాన నై పల్కితిన్
న న్నాపాపము వచ్చి ముట్టకొనియెన్ నాపాలిదైవంబ వై
యిన్నీచుం బరిమార్ప వేగ పఱతేవే నన్ను రక్షింప మీ
యన్నం గ్రన్ననఁ జీరవే [1]యరుగవే యత్యుగ్ర శీఘ్రంబునన్.

111


ఉ.

(హా యను నో నరేంద్ర యను హా రఘుకుంజర నీవు వేగ రా
వే యను నెంతదూరమున కేఁగితొకో యను నాయెలుంగు విం
టే యను విన్న నీశరము లీతల లింతకుఁ ద్రుంచి వైవకు
న్నే యనుఁ గైకకోర్కి ఫలియించె బళీ యను దైవమా యనున్.

112


ఉ.

రాఘవుదేవిఁ దేరఁ దగురా యన రెవ్వరు నోర నిత్తెఱం
గాఘనబాహువిక్రమున కైనను జెప్పరు దన్నిరంతరా
మోఘశరాళి వీనిశిరముల్ దునుమాడువిధంబు సూడ రో
మేఘములార వేగ చని మీ రయినం బతితోడఁ జెప్పరే.)

113


వ.

అని యనేకవిధశోకాలాపంబులతోడ నందంద యాక్రందనంబు సేయుచు నలు
దిక్కులు సూచి.

114


సీ.

పావనాకార గోదావరీదేవి నీ, వెఱిఁగింపవమ్మ రాజేంద్రుతోడ
నో మాల్యవంత పుణ్యోన్నత గిరినాథ, చెప్పంగదే రాజసింహుతోడ
నో జనస్థానమహీజములార యీ, విధ మెఱిఁగింపరే విభునితోడ
నో దండకాటవి నున్నతాపసులార, నాపాటు చెప్పుఁడీ నాథుతోడ
నేను శ్రీరాముభార్య మీ రెవ్వ రైన, నడ్డపడి తాఁకి విడిపింపరయ్య కావ
రయ్య సురలార మునులార యక్షులార, యఖిలదిక్పతులార పుణ్యాత్ములార.

115


క.

అని ఘనశోకాతుర యై, పనవఁగ నయ్యేడ్సు వినియెఁ బక్షీంద్రుఁడు శా
తనఖాగ్రకులిశధారా, వినిహతభేరుండవిహగవిగ్రహుఁ డంతన్.

116


వ.

[2]విని యోహో వెఱవకు మే నున్నవాఁడ నిన్నీచుం బొరిగొని నిన్ను విడిపింతు
నని పలుకుచుం బెలుచ.

117


సీ.

తనయున్నగిరి బెట్టు తాఁచి బి ట్టెగసిన, నది శేషుపడగలఁ గుదియ నదుమ
జవముమై నెఱకలు జాడించువడిఁ బుట్టు, ధూళి మేఘంబులఁ దూలఁదోల
నిలునిలుమీ దైత్య నిను వ్రత్తునని పేర్చు, నదులుపు బ్రహ్మాండ మద్రువఁ జేయ
విపులకోపోద్రేకకవృత్తము లైననే, త్రములరశ్ములు రవిరశ్మి నెగుప
శరభసింహాదిమృగరక్తరసాంద్రశోణ, ఘోరచంచుప్రభాఘనక్రూరవక్త్ర
నఖరకులిశప్రచయసముకన్నతశరీరుఁ, డగుజటాయువు గదిసె నయ్యసురవీరు.

118
  1. మగుడవే
  2. ఇందులకు 'విని యోహో వెఱవకు వెఱ, వను నీ కే వెనుక నున్నవాఁ
    డవ యి న్నీ, చునిఁ బో నీ కిపుడు వధిం, చి నినున్ విడిపింతు ననుచుఁ జెచ్చెరఁ బెలుచన్' అని
    వ్రాఁతప్రతులం బద్య మున్నది.