పుట:భాస్కరరామాయణము.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నంతరంగంబుతో నేఁగె నప్పు డచట, నార్తరవ మట్లు మ్రోసిన నాత్మఁ గలఁగి.

63


వ.

[1]ఉల్లంబునం దల్లడం బొదవ ధాత్రీపుత్రి సుమిత్రాపుత్రుం బిలిచి దీనవదన
యగుచు ని ట్లనియె.

64


శా.

వింటే లక్ష్మణ రామునార్తరవ మై వీతెంచె నే నొంటి పొ
మ్మంటిం దమ్ముఁడ యేమి పుట్టెనొ కదే హా లక్ష్మణా యంటగా
వింటిం దాలిమిఁ బట్టఁ జాల నటవీవీథిం గురంగంబువె
న్వెంటం బోక కలంపఁ గీడు సనవే వేగంబ నిన్ వేఁడెదన్.

65


క.

కుడిక న్నడరఁ దొడంగెను, దడయం డొకకీడు లేక ధరణీశుం డె
య్యెడ రైన నిన్నుఁ బిలిచెనొ, వడిఁ జేకొనవయ్య భ్రాతృవత్సల రామున్.

66


చ.

అని పలుమాఱు దైన్యమున నశ్రులు గ్రమ్మఁగఁ బల్కునట్టియ
వ్వనితకు నాతఁ డిట్టు లను వాసవపద్మజరుద్రులైన నా
ఘనున కెదుర్ప నోడుదు రగణ్యపరాగ్రముఁ డమ్మహాత్ముఁ డే
దనుజుల నైనఁ ద్రుంచి వెసఁ దా నిట వచ్చుఁ దలంక నేటికిన్.

67


తే.

మాయరక్క సుఁ డొక్కఁ డీమాడ్కిఁ జీరె
నన్ను నెలుఁగెత్తి యెఱుఁగ నే నాకసంబు
విఱిగి పైఁబడ్డ నాత్మలో వెఱవఁ డెపుడు
నమ్మహాత్ముని నిటు సేయ నవనిఁ గలరె.

68


క.

[2]నిను ని ట్లూఱడిపోయెను, మనుజేంద్రుఁడు నాకుఁ దగునె మానిని యిచ్చో
నిను డించి పోవఁ బోయిన, ననుమానము లే దపాయ మగు నీ కిచటన్.

69


వ.

[3]అని వెండియు.

70


క.

దెప్పర మప్పురుషాగ్రణి, కెప్పాటను గలుగు నేర దెందును నోహో
నిప్పుఁ జెద లంట నేర్చునె, తప్పఁ దలఁచి తీ వి టేల తలఁకెద వకటా.

71


ఉ.

అట్టిద యైన నింతక యహర్పతి తప్పఁ జరించు మేరు వి

  1. 64 మొదలుగా 66 వఱకుఁ గలవ్రాఁతప్రతులపాఠము.
    ఉ. భూపతి యార్తిఁ బొందె నని భూమిజ దల్లడి మొంది లక్ష్మణా
         పాపము వొందె లెమ్ము వెసఁ బాఱుము రాక్షసబాధఁ బొందఁగా
         నోపు రఘూద్వహుండు నిను నొత్తిలి చీరె నిశాటకోటిచే
         నే పఱఁ బోలుఁ బోయి వెస నేఁగు జవంబునఁ బొమ్ము క్రమ్మనన్.
  2. నను నిల్లూ రిడి పోయెను; నిను నిల్లడ యిడి పోయెను
  3. 70 మొదలుకొని 74 వఱకుఁ గలవ్రాఁతప్రతులపాఠము,
    క. అనవుడుఁ బేర్చినశోకం, బునఁ బె ల్లేడ్చుచు మహాత్ముఁ బుణ్యచరిత్రున్
         మనుజేంద్రుఁ గావఁ దగవే, చనునే రామునకుఁ దోడు చనవు రయమునన్.