పుట:భాస్కరరామాయణము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాంతపద్యములను మంత్రిభాస్కరుని ననుకరించి తిక్కన వ్రాసె ననుటకంటెఁ దిక్కన ననుసరించి హళక్కిభాస్కరుఁడు రచించె ననుట మఱింతయుపపన్నముగా నున్నది.


ఇంతవఱకును నీరామాయణమందు మంత్రి భాస్కరుని రచనము లే దని నిరూపిత మయ్యె. ఇక హళక్కిభాస్కరుఁడే దీనిని రచించినవాఁడేని యన్నికాండములను దానే రచింపక యొక రెండుకాండములే రచించుటకును దక్కినవి మల్లికార్జునాదులు రచించుటకును నిట్లు నలుగురుకవులచే రచితమై యుండఁగా నిది భాస్కరునిపేరనే వెలయుటకును గారణములు విమర్శింపవలసియున్నది. అందు భాస్కరుఁడు వృద్ధుఁ డగుటచేఁ దానే యన్ని కాండములను రచింపఁజాలక తక్కిన పుత్రమిత్రాదులం గొని రచించె ననియుఁ బ్రధానుం డతఁడే యగుటం జేసి యతనిపేర నీ గ్రంథము వెలసె ననియుఁ గొందఱును, నతఁడు సపుత్రమిత్రచ్ఛాత్రముగాఁ దాను రచింపఁగోరి యట్లు రచించినాఁ డనియు, రంగనాథరామాయణమునకును దీనికిని నెఱ్ఱన రామాయణమునకును దీనికిని భేదము దెలుపుటకై దీనికవులలో ముఖ్యుండగు భాస్కరుని పేర నిది పిలువంబడె ననియుఁ గొందఱును, జెప్పెదరు. మల్లికార్జునుఁడు 'భాస్కరసత్కవిపుత్ర' యన్నట్లు భాస్కరునిపుత్రుం డై యతనియాదేశముచొప్పున బాలకాండాదుల రచించినవాఁడేని, తండ్రివలెనే కృతిపతి యగుమారనను బాలకాండముతొలుత నేల నంబోధింపఁడయ్యె? మఱి బాలకాండముతుదను శివునే సంబోధించి యున్నాఁడు గాని మారనను గాదు. బాలకాండమునఁ దొలుతఁ గాని తుదను గాని బొత్తిగా సాహిణిమారుని ప్రస్తావమే లేదు. మఱి యతఁడు రచించిన కిష్కింధాకాండమందో తొలుత

క.

'శ్రీరమణీ ప్రియరమణీ, శ్రీరమ్యోరుకుచకుంభసేవాలోల
స్ఫారదృగాశ్రయనేత్రాం, భోరుహపూజాప్రహృష్ట పురుషవిశిష్టా.’

యని యున్నది. ఇది విష్ణువునకుఁగాని వలయునేని విష్ణుభక్తుఁ డగునొకపురుషవరునికిఁగాని సంబోధనము గావచ్చును. కాన యిందుఁ గంఠోక్తముగా సాహిణిమారునికి సంబోధనము లేదు. ఈకాండముతుదినో శివసంబోధన మున్నది. తొలుతటిసంబోధనము విష్ణుపరముగాను తుదిసంబోధనము శివపరముగాను నుండుట మిక్కిలియుఁ జింత్యము. మఱియు నిందుఁ దుదిని

'లాటీచందనచర్చ చోళమహిళాలావణ్యసామగ్రి ...
పాటింపందగు నీదుకీర్తి రథినీపాలాగ్రణీ సాహిణీ.'

అని సాహిణిమారునిసంబోధనముగూడఁ వ్రాతప్రతులందుఁ బెక్కిట లేదు; అచ్చుప్రతులందు శివసంబోధనముతోడ నీమారనసంబోధన సైత మున్నది. ఈ రెండునంబోధనములను దుది నుంచుట క్రమ మెట్లు? ఇతఁడు రచించిన సుందరకాండముతొలుతనో, బాలకాండకిష్కింధాకాండముల తొలుతను లేని