పుట:భాస్కరరామాయణము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిచ్చునట్లు చెప్పి హళక్కిభాస్కరాదులచేత దానిని జేయించినట్లును, రాజు రంగనాథునే సత్కరించినట్లును దానిపయిని దక్కినవిషయములు జరిగినట్టును జెప్పుచున్నారు. మఱికొంద ఱీకథయందు మంత్రిభాస్కరుని ప్రసక్తియే తేక యంతయు హళక్కిభాస్కరపరముగాఁ జెప్పుచున్నారు. మఱికొందఱు మంత్రిభాస్కరుఁడు బుగ్గరాజు కుమారుఁ డయిన సాహిణిమారుని కాలమందు మంత్రిగాను నాస్థానకవిగాను నుండె ననియు నితఁడే మొదట రామాయణము నంతయు నారాజున కంకితముగా రచించె ననియు, నీగ్రంథ మేకారణముననో యత్యల్పకాలమున శిథిలము కాఁగా నపుడు కృతిపతి యగుసాహిణీమారునికుమారుఁడు కుమారరుద్రదేవుఁడు తనతండ్రికాలమునుండి యాశ్రితుఁ డై యున్న హళక్కిభాస్కరుని గ్రంథము నుద్ధరింపు మనఁగా నతఁ డాసంపుటమును శోధించి యం దారణ్యకాండము తప్పఁ దక్కిన దంతయు శిథిల మగుటం జూచి యక్కాండమునం దందంద చెడినభాగములను సరిపఱచి వార్ధకమును బట్టి తక్కినకాండములను దానే రచింపఁ బూనఁజాలక మల్లికార్జునాదులసాహాయ్యమున దానిని బూరించె ననియు, నం దెవ్వరు నయోధ్యాకాండమును బూరించుటకుఁ బూనకుండుటను జూచి రా జయిన కుమారరుద్రదేవుఁడు తానే దానిని సంగ్రహముగా రచించె ననియుఁ జెప్పెదరు. పూర్వము రూపింపఁబడిన సాహిణిమారాదులయు మంత్రిభాస్కరాదులయు కాలములను బట్టి చూడఁగా నివి యన్నియుఁ గొన్ని కల్పితములును గొన్ని నిరాధారములు నగుట తెలియుచున్నది.

ఆరణ్యకాండము తక్కినకాండములవలెఁ గాక యాశ్వాసములుగా విభక్త మగుటంబట్టి యిది తక్కినకాండములకవులచేతం గాక వేఱుకవిచే రచిత మగు నందురు. మఱియు నారణ్యకాండాంత్యపద్యములును తిక్కనయుత్తరరామాయణమునందలి యాశ్వాసాంతపద్యములును నొక్కరూపై యుండుటచే నారణ్యకాండకర్తకును దిక్కనకును గొంతసంబంధము సూచిత మగుచున్న దందురు.ఇట్లాశ్వాసవిభజనమును బట్టి యుద్ధకాండభాస్కరుఁడు గాక మఱియొకభాస్కరుఁ డనియు నాశ్వాసాంతపద్యములనుబట్టి యా భాస్కరుఁడు తిక్కనతాత యగు మంత్రిభాస్కరుఁడే యగు ననియుఁ జెప్పఁబడుచున్నది. హళక్కిభాస్కరుఁడు యుద్ధకాండము కడవఱకును రచింపక నడుమనే విడుచుటచే దాని నాశ్వాసములుగా విభజించుట కయితిలేదు, అయిన నతఁడు రచించినంతవఱకు 1133 పద్యము లుండుటచే నాశ్వాసవిభాగము చేయఁగూడు ననవచ్చును. మఱి యాశ్వాసాంతపద్యములగమనికం బట్టి యారణ్యకాండ భాస్కరుని తిక్కనకుఁ దాతఁగాఁ జేయుటయు యుక్తమైనం గావచ్చును. కాని యీ విషయములను, మంత్రిభాస్కరుడు రామాయణము రచించె ననుటకుఁ గవిప్రస్తావాద్యుపపత్తి లేమింజేసియు, నతఁడు సాహిణీమారుని కాలమువాఁడు గామింజేసియు, నంగీకరింప వలను గాకున్నది. వీనినెల్లఁ జూడఁగా నాశ్వా