పుట:భాస్కరరామాయణము.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

అత్తఱి నెమ్మొగంబుజిగి నచ్చపువెన్నెల గాయ నింపు ద
ళ్కొత్తుసమీపభూజముల నొయ్యనఁ బువ్వులు గోయుచున్న రా
జోత్తముదేవి చూచెఁ జిగు [1]రొత్తెడువేడ్కలు సందడింపఁగన్
గ్రొత్తమెఱుంగు లేణమునకుం దనకున్ నడు మెల్ల నిండఁగన్.

26


మహా.

ధరణీసంజాత ప్రీతిం దనుఁ గనుఁగొన నుద్యద్గతిం బాఱుఁ దాఱుం
బొరి డాయుం బూరి మేయుం బొలుపుగ నిగుడుం బొంగుఁ గ్రుంగుం జెలంగుం
దిరుగు గుప్పించు మించున్ దెసల నెసఁగ వర్తించు వే చౌకళించున్
గర మొప్ప నిల్చుఁ బొల్చుం గనకహరిణ మక్కాననాంతంబులోనన్.

27


క.

(మరగినవిధమునఁ జేరువఁ, దిరుగుఁ బసికొనుచుఁ గలయఁ దృణములు వెదకున్
ఖురపుటమునఁ గడు పొయ్యన, బరికికొనుచుఁ జక్క నిలుచుఁ బలుమఱు నెదురన్).

28


క.

ఈలీలం బొలయఁగ నా, లోలాక్షి విలోల యై వికిలోకించి మహీ
పాలుని లక్ష్మణుఁ బిలిచినఁ, జాలఁగ వెస నేఁగి కనిరి సారంగంబున్.

29


తే.

అపుడు లక్ష్మణుఁ డేర్పడ నామృగంబు, నద్భుతాకారవిలసన మధికసంశ
యాత్ముఁడై చూచి నిజబుద్ధి నసురమాయ, గా నిరూపించి యనియె నగ్రజునితోడ.

30


మనలం బిల్చుట భూమిపుత్రి మది నిమ్మాయామృగంబున్ నిజం
బని భావింపఁగఁబోలు వీఁ డసుర మాయారూపుఁ డెందేని నొ
క్కనెపం బిమ్మెయిఁ జూపి చిక్కు వఱుపంగాఁ జూచె మోహంబునన్
జననాథోత్తమ పట్టఁ జూచెదు సుమీ చర్చింప కుద్యద్గతిన్.

31


క.

అని పలుకఁగ నాలోనన, జనకజ పతి డగ్గఱంగఁ జనుదెంచి కనుం
గొను రాజముఖ్య యొప్పుల, గని యగునీమృగవిలాసకమనీయగతుల్.

32


క.

కరువున గండరువునఁ జి, త్తరువున నినచంద్రరుచులఁ దారలరుచులన్
[2]హరిహరధాత్రాదుల కీ, హరిణము సరిరూపు వడయ నలవియె యెందున్.

33


వ.

అనుచు సాభిలాషంబుగాఁ బెక్కుచందంబులం గొనియాడి.

34


చ.

అలఘు చరిత్ర దీని వెర వారఁగ నెమ్మెయి నైనఁ బట్టి తే
వలయు నరేంద్ర మిమ్ముఁ బనిఁ బంపెడుదాననె దీనిమీఁద మీ
రలరుచుఁ జూచుభంగిఁ గని యాడితిఁ గన్నులపండు వెప్పుడున్
గలుగదె యెల్లనాఁడు నధిరేకంబుగ [3]నీమృగరత్న మబ్బినన్.

35


చ.

అని కడువేడ్కతోఁ బ్రియుని నామృగలోచన వేఁడినన్ మనం
బునఁ గడునుత్సవం బొదవఁ బోయెద నిప్పుడ పట్టి తెచ్చెదం
గనుఁగొను మంచుఁ బూన నిజకాంతునితో ననురాగభావసం
జనితవికాసభాసి యయి జానకి యి ట్లనుఁ గౌతుకంబునన్.

36
  1. రొత్తెడునంఘ్రులు.......మెఱుంగు లామృగముకుం దనకున్
  2. 'హరిహరవేధాదుల' అనియే వ్రా. ప్ర.
  3. నీమృగచర్మ మబ్బినన్