పుట:భాస్కరరామాయణము.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

విదియచందురుఁ డైన వెలఁదినెమ్మోమునఁ, గలిసిన సంపూర్ణకాంతి వడయు
వడగాలి యైన నప్పడఁతియూర్పుల చెంతఁ, బరఁగిన మలయాద్రిపవనుఁ బోలు
నమవసయిరు లైన [1]నయ్యింతిచిఱునవ్వు, సొలపున వెన్నెల చెలువుఁ బూను
నలరి యేఋతువుల నయిన నాసతిమేని, ప్రభ గన్నవనములు పల్లవించు
బట్టబయ లైన నాసితపద్మనేత్ర, కన్నుఁగవయొప్పు జిగిసొంపు గడలుకొనిన
విమలకమలషండంబులవిధము నొందు, నెందు సరి వోల్పఁ గలరె యయ్యిందుముఖికి.

278


[2]మఱియును.

279


సీ.

మణిమయమంజీరమంజురుతమ్ములఁ, గలహంసికలఁ బిల్చి గతులు నేర్పుఁ
గమ్మయూర్పులఁ దేఁటిగముల నాకర్షించి, లలి గానలీలల నలవరించు
హస్తపల్లవకాంతి హరిణులు నెలయించి, దృష్టివిభ్రమముల తెఱఁగుఁ జూపు
రుచిరబింబాధరారుణదీప్తిఁ జిలుకల, రావించి మధురోక్తిరచనఁ గఱపు
నన వితర్కింపఁదగుచు నయ్యలరుఁబోఁడి, యనుపమానవిలాసంబు లలర నమరు
నమరగంధర్వయక్షవిద్యాధరాది, జాతులం దెందుఁ జూడ నీచంద మెఱుఁగ.

280


క.

అంగవిలాసమ్మును ద, న్వంగికిఁ జెలువారుతెఱఁగు లవి యే మని చె
ప్పంగల దయ్యొప్పిదము గ, నుంగొన మగువలకు నగు మనోభవవికృతుల్.

281


క.

ప్రమదాజను లొరు లేటికి, నమరాంతక లంక యేటి కారామార
త్నము సిద్ధించినవారికి, నమరేంద్రపదంబు గోరునది యేమిటికిన్.

282


ఉ.

కావున రామలక్ష్మణులఁ గయ్యమునం బరిమార్చి లోకవి
ద్రావణ మైననీదుభుజదర్ప మెలర్పఁగ సీతఁ దెచ్చి సం
భావన నిష్టభోగఫలభాగినిఁ జేయుదుగాక యన్న నా
రావణుఁ డప్డు మన్మథశరంబులఁ జిత్తము దూల లోలతన్.

283
  1. నయ్యింతి చిఱునవ్వు, పొలసిన వెన్నెలవెలుఁగుఁ గడచు
  2. 279 మొదలుకొని 289 వఱకుఁ గల వ్రా. ప్ర. పాఠము
    క. అని కొనియాడిన దనుజుని, మనమంతన మరుఁడు సొచ్చె మారీచుతపో
        వనమున కరిగె రయంబునఁ, గనకరథం బెక్కి గగనగతి నట్టియెడన్.
    చ. గరుడుఁడు తొల్లి లీల గజకచ్ఛపయుగ్మముతోడఁ గూడ నే
        తరువున శాఖ నూనె విదితంబుగ నప్పెనుమఱ్ఱిముందటం
        దెరువునఁ జూచుచుం దనమదిన్ వినతాసుతులావు మెచ్చుచున్
        సరభసభంగి నేఁగియును సాగరతీరతపోవనంబునన్.
    క. మారీచుఁ గాంచుటయు నతఁ, డారక్షోవిభునిఁ జూచి యర్చించి ప్రియం
         బారఁగఁ గ్రమ్మఱ వచ్చిన, కారణ మే మనినఁ బంక్తికంధరుఁ డనియెన్.
    చ. పరమహితుండ వార్యుఁడవు బంధుఁడ వాప్తుఁడ వెల్లభంగి నీ
        వరయఁగ నీసహాయమున నంబుజలోచన రాముదేవి న
        ద్ధరణిజ నేను గైకొని ముదంబునఁ దేలుదు నాబలంబు నీ
        వెరవును మాయయుం గలుగ వేయువిధంబుల నబ్బు నింతియున్.