పుట:భాస్కరరామాయణము.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డెవ్వఁడొ వానిపే [1]రెఱిఁగి యిప్పుడు చెప్పుము నూఱి మ్రింగెదన్.

158


క.

అని పలికిన ఖరుతో న, మ్మనుజేంద్రులపొలుపుఁ బలుపు మహిఁ బంచవటం
బున నున్నతెఱుఁగు సెప్పిన, విని కన్నుల నిప్పు లురుల విస్ఫురితగతిన్.

159


వ.

[2]మండుచు ఖరుం డంతకాకారులఁ బదునలువుర రాక్షసులం గనుంగొని.

160


చ.

ఇరువురు మర్త్యు లొక్కహరిణేక్షణతోఁ జనుదెంచి దండకాం
తరమున నున్నవా రఁట రకణంబున వారి వధించి యిన్నిశా
చరికిఁ బ్రియం బొనర్పుఁడు వెసం జనుఁడీ యని పంప నట్ల వా
రరిగిరి చుప్పనాతి ముద మందుచు ముందఱఁ ద్రోవ పెట్టఁగన్.

161


క.

చనుటయు దనుజుల దవ్వులఁ, గని రాఘవుఁ డనుజుతోడఁ గంటే మనపైఁ
గొనివచ్చె వికృతదానవి, తనవా రగువారిఁ గ్రూరదైత్యుల ననుచున్.

162


చ.

కరమునఁ జూపి శాతవిశిఖంబులుఁ జాపముఁ బుచ్చికొంచు భీ
కరముగఁ గొంతడ వ్వెదురుగాఁ జని యి ట్లను మీకుఁ బ్రాణముల్
గరముఁ బ్రియంబు లేనిఁ దొలఁఁగం జనుఁ డుద్ధతి మాని పూని సం
గరమున నిల్చినన్ బ్రదుకఁ గావశమే యని తెల్పి పల్కినన్.

163


వ.

(అద్దానవు లి ట్లనిరి.)


శా.

రక్షోనాయకుఁ డల్గెనేని వశమే రా రామ ప్రాణంబు
జిక్షోణిన్ మెయి నిల్ప నీ కనుచు నాక్షేపించుచున్ శూలముల్
రూక్షప్రేక్షణు లన్నిశాటభటవీరుల్ వైచి రీరేడు వి
శ్వక్షోభంబుగ నార్చుచున్ సురవిపక్షగ్రామణుల్ పెల్లుగన్.

164


త.

వైచుటయు నొక్కతెగఁ గత్తివాతియమ్ము
లతఁడు పదునాల్గు నిగిడించి యద్భుతముగఁ
దునిమెఁ బదునాల్గుశూలమ్ములను మహోగ్రు
లగుచు వా రంతఁ బోక పై నడరుటయును.

165


ఉ.

వెండియుఁ జండకాండములు వే పదునాల్గు సమగ్రశక్తి ను
ద్దండరయంబునం దొడగి దైత్యుల నేసినఁ దూలి కూలి రా
ఖండలుఁ డేచి ఱెక్కలు దెగన్ వడి వేసిన నోలిఁ గూలుపె
క్కొండలభంగిఁ బాదహతిఁ గుంభిని గంపము నొండ దందడిన్.

166
  1. రు నెఱిఁగింపుము మున్మిడి నూఱి; రెఱిఁగి యేర్పడఁ జెప్పుము నూఱి
  2. 160 మొదలుగా 161 వఱకుఁ గలపాఠమునకు మాఱుగాఁ
    క. మదనాగాయుతసత్త్వులఁ, బదునలువుర దనుజభటులఁ బనిచె ఖరుం డ
        మ్ముదిత వెసఁ దెరువు పెట్టఁగ, నదయులు చని రసురు లుగ్ర మగురభసమునన్.