పుట:భాస్కరరామాయణము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భాస్కరుఁడు సాహిణిమారున కంకితముగా రామాయణము రచించె ననుట యసంబద్ధముగా నున్నది.

పదునాలుగవశతాబ్దముమధ్యమువఱకుఁ గవిస్తుతులందు భాస్కరుఁ డనుమాటయే కలుగదు. ఆశతాబ్ధముతుదినుండి భాస్కరుఁడు శ్రీనాథుఁడు భీమన రంగనాథుఁడును గవిస్తుతులం గనుపట్టుచున్నారు. ఈభాస్కరుఁడు, పదునాలుగవశతాబ్దపు హళక్కి భాస్కరుఁడే కావలయును; పండ్రెండవశతాబ్దపు మంత్రిభాస్కరుఁ డైనయెడల నతఁడు నడుమ నున్నశతాబ్దములం దెల్లఁ బేర్కొనంబడక పదునాల్గవశతాబ్దమునంతమునఁ బేర్కొనంబడె ననుట యనుపపన్నముగా నున్నది. మఱియు మధ్యకవులలోనివాఁ డగు అంగర నృసింహకవి తనరాజరాజాభిషేకమందు

ఉ.

'ఇద్ధగుణుం బ్రబంధపరమేశ్వరు నెఱ్ఱనప్రగ్గడన్ మనః
పద్ధతి నిల్పి సూక్తిరుచి భాస్కరుఁ డైనహళక్కిభాస్కరున్
బుద్ది ఘటించి సంతతము పూని భజింతు వచఃప్రసాదసం
సిద్ధునిఁ జిమ్మపూడికులశేఖరు నయ్యమరేశసత్కవిన్.'

అని స్పష్టముగా హళక్కిభాస్కరుఁడని తెల్పినాఁడు. కనుక ననంతామాత్యుని భోజరాజీయమందు,

'నన్నయభట్టుఁ దిక్కకవినాయకు భాస్కరు రంగనాథు'

ననియు, వెన్నెలకంటి సూరన విష్ణుపురాణమున

'ఎన్నికగాఁ బ్రబంధపరమేశ్వరుఁ దిక్కన సోమయాజినిన్
నన్నయభట్టు భాస్కరుని నాచనసోముని రంగనాథునిన్'

అనియు, ప్రౌఢకవి మల్లన రుక్మాంగదచరిత్రయందు

'నన్నయభట్టుఁ దిక్కకవి నాచనసోముని భీమనార్యుఁ బే
రెన్నికఁ జిమ్మపూడియమరేశ్వరు భాస్కరు శంభుదాసునిన్'

అనియు నిట్లే యిటీవలికృతులయందునుం గలభాస్కరుఁడు హళక్కిభాస్కరుఁడే కాని మంత్రిభాస్కరుఁడు గానేరఁడు.

పదేనవశతాబ్దమునుండి భాస్కరుఁడు భీముఁడు రంగనాథుఁడు శ్రీనాథుఁడు మొదలగు కవులు కవిస్తుతులం గానిపించుటంబట్టి వీర లొండొరులకాలములందో యొండొరుల యంత్యకాలములందో, యొండొరులకుఁ బిదపదాపటికాలములందో యున్నవారు గావచ్చును. కాన భాస్కరునితోఁ బాటిగాఁ దఱచుగాఁ గవిస్తుతులందుఁ గానిపించుభీమన యతనికాలపువాఁడో యతనికి సమీపకాలమువాఁడో కావలయును. ఇందులకు నిదర్శనముగా భీమకవి సాహిణిమారనను గూర్చి

'చక్కఁదనంబుదీవి యగుసాహిణిమారుఁడు మారుకైవడిం
బొక్కిపడం గలండు చలమున్ బలముం గలయాచళుక్యపుం