పుట:భాస్కరరామాయణము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

 సారకథాసుధారస మజస్రము నాగళపూరితంబుగా
నారఁగఁ గ్రోలుచున్ జనులు హర్షరసాంబుధిఁ దేలునట్లుగా
భారతసంహితన్ మును త్రిపర్వము లెవ్వఁ డొనర్చె నట్టివి
ద్యారమణీయు నంధ్రకవితాగురు నన్నయభట్టుఁ గొల్చెదన్.


చ.

 ఉభయకవిత్వతత్త్వవిభవోజ్జ్వలు సద్విహితాధ్వరక్రియా
ప్రభు బుధబంధు భూరిగుణబంధురు భారతసంహితాక్రియా
విభుఁ బరతత్త్వకోవిదు నవీనపరాశరసూను సంతత
త్రిభువనకీర్తనీయయశుఁ దిక్కకవీశ్వరుఁ గొల్తు భక్తితోన్.

అని నన్నయ్యతిక్కనలను మాత్రమే స్తుతించియున్నాఁడు. మారనకు సమీపకాలపువాఁ డయినమడికి సింగనయు

సారమతిన్ భజింతు ననిశంబును నన్నయతిక్కనార్యులన్

అని యాయిరువురనే పేర్కొనియున్నాఁడు. ఈతనికిఁ దరువాతివాఁ డగు నెఱ్ఱనయు నాయిద్దఱుకవులనే స్తుతించియున్నాఁడు. తిక్కన 'సారకవితాభిరాముఁ' డనుటం బట్టియుఁ, గేతన దశకుమారచరితమునందు

శా.

శాపానుగ్రహశక్తియుక్తుఁ డమలాచారుండు సాహిత్యవి
ద్యాపారీణుఁడు ధర్మమార్గపథికుం డర్థార్థిలోకావన
వ్యాపారవ్రతుఁ డంచుఁ జెప్పు సుజనవ్రాతంబు గౌరీపతి
శ్రీపాదప్రవణాంతరంగు విబుధశ్రేయస్కరున్ భాస్కరున్.

అని 'శాపానుగ్రహశక్తియుక్తుఁడు' గను 'సాహిత్యవిద్యాపారీణుఁడు' గను జెప్పి యుండుటంబట్టియు, మంత్రిభాస్కరుఁడు మంచికవి గావచ్చును గాని కవిస్తుతుల కెక్కు నంతటి మహాకవి గాఁడని తెలియుచున్నది. మఱియుఁ గేతన యతని నట్లు వర్ణించియు రామాయణమును రచించినట్లు చెప్పమిచే దాని నతఁడు రచింపలేదనియుఁ దేటపడుచున్నది.

[1]ఇది యిట్లుండఁ దిక్కనశిష్యుఁ డయిన మారననుబట్టి తిక్కనకాలము మఱింత నిర్ణీతముగాఁ దెలియుచున్నది. మారన 1295 వ సం॥ మొదలుకొని 1323 సం॥ వఱకుఁ బరిపాలనము చేసిన రెండవప్రతాపరుద్రుని సేనాపతులలో నొక్కండగు నాగయగన్నమంత్రికిఁ దన విష్ణుపురాణము నంకితము చేసియున్నాఁడు. కనుక మారనగురుం డయినతిక్కన 1290 వ సం॥వఱకు జీవించి యుండవచ్చును. దీనింబట్టి చూడఁగా 'అంబరవిశశి' యను పద్యము మొదలయినవి యవిశ్వసనీయములుగాఁ జూపట్టుచున్నవి. తిక్కన యీకాలముంబట్టి మంత్రిభాస్కరుఁడు పండ్రెండవశతాబ్దముతుదివాఁ డని తెలియుచున్నది. దీనింబట్టి చూచినను మంత్రి

  1. కవులచరిత్రము భాస్కరోదంతము మొదలగువానినుండి యిందలివిషయములు కొన్ని గయికొనంబడినవి, విజ్ఞానచంద్రికవారి 'ఆంధ్రుల చరిత్రము' నుండియుఁ గొన్నివిషయములు గ్రహింపబడినవి.