పుట:భాస్కరరామాయణము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యేకాని తిక్కన మెచ్చుకొనునంతటి కవిత్వాతిశయమునుబట్టి వచ్చినది కాదు. కాన దీనివలన నీభాస్కరుఁడు మహాకవిగాఁ దోఁపలేదు. ఇతఁ డెట్టివాఁడయినను గానీ, ఈ రాయనభాస్కరుఁడు మంత్రిభాస్కరుఁడు గాఁడు. ఎ ట్లన, సునందాపరిణయమును రచించిన చింతకుంట కోదండరామకవి

సీ.

ఘనతరౌదార్యదీక్షాకల్పితానల్ప, కరనిబద్ధసువర్ణకంకణుండు
ఆసేతుశీతనగాంతరరాట్సభా, మధ్యవిశ్రుతకీర్తిమండలుండు
కొండపల్లీవినుకొండదుర్గద్వయీ, దేశప్రజావనధీయుతుండు
సకలావనీపకసంతానయాచిత, వస్తుప్రదానప్రవర్తనుండు
అన్నవేమమహీశదత్తాగ్రహార
మదకలాందోళికాశ్వసన్మణివిశేష
భూషణాద్యష్టభూతివిభూషితుండు
భానుతేజుండు రాయనభాస్కరుండు.

అని రాయనభాస్కరుని వర్ణించియున్నాఁడు. నందవరీకుఁ డగుకోదండరామకవి యితనిని దనవంశమువాఁడుగాఁ జెప్పుకొనుటచే నితఁడును నందవరీకనియోగిబ్రాహ్మణుఁడు. మంత్రిభాస్కరుఁ డాంధ్రనియోగికబ్రాహ్మణుఁడు. రాయనభాస్కరునింటిపేరు రాయనవారు. మంత్రిభాస్కరు నింటిపేరు కొత్తరువువారు లేక గుంటూరివారు. రాయనిభాస్కరు నివాసస్థలము వినుకొండ. మంత్రిభాస్కరునిది గుంటూరు. రాయనభాస్కరుని కుమారుఁడును మనుమనుఁడును,

సీ.

కవు లిచ్చి భూపతి గాచిపట్టఁగ నిల్పెఁ, బ్రజలకై రాయనభాస్కరుండు
వరదాతయై మణీవలయముల్ కవి కిచ్చె, దండిభాస్కరుసూతి కొండమంత్రి
భాస్కరువలెఁ గీర్తిఁ బడసెఁ దత్పౌత్రుఁడౌ, ఘనరామలింగ భాస్కరుఁ డొకండు

అను ముప్పదియిద్దఱు మంత్రులపద్యముంబట్టి వరుసగాఁ గొండనయు రామలింగన్నయు నగుదురు. మంత్రిభాస్కరునికొడుకును మనుమఁడును వరుసగాఁ గొమ్మనయుఁ దిక్కనయు నగుదురు. రాయనభాస్కరుఁడు మొదట నుదాహరింపఁబడిన పద్యముంబట్టి యనవేమరాజుకాలమువాఁ డని తెలియుచున్నది. అనవేమారెడ్డి హూణశకము 1340 మొదలుకొని 1366 వఱకు రాజ్యము చేసినట్టు చెప్పఁబడియున్నది. కనుక రాయనభాస్కరుఁడు పదునాలుగవశతాబ్దమువాఁడు. మంత్రిభాస్కరుఁడు పండ్రెండవశతాబ్దాదివాఁ డని ముందె నిరూపింపఁబడి యున్నది. కాన రాయనభాస్కరహుఁడు మంత్రిభాస్కరుండు కానేరఁడు. కనుక మంత్రిభాస్కరుఁడు కవిత్వమున ఖ్యాతి గాంచఁడయ్యె నని తెలియుచున్నది. మఱియుఁ దిక్కకవిశిష్యుఁ డగు మారన, రామాయణకర్త మంత్రి భాస్కరుఁడేని, తనగురు వంతగొప్పగాఁ జెప్పికొన్నయతనితాతగారిని దానును గవిస్తుతిలోఁ బేర్కొనకుండునా? అతఁడు