పుట:భాస్కరరామాయణము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెప్పెనే కాని రామాయణమును రచించె నని చెప్పలేదు. కాఁబట్టి తాత రామాయణము రచించుటచే మనుమఁ డుత్తరరామాయణము రచించియుండునని, తిక్కన యుత్తరరామాయణరచనము బట్టి యతనితాతను రామాయణరచనమునకుఁ బట్టము గట్టరాదు. తిక్కన తనతాత రామాయణమును రచించియుండుటంబట్టి తాను మిగిలినయుత్తరరామాయణము వ్రాసినవాఁ డయ్యెనేని, యిపుడు నన్నయభట్టు వ్రాయఁగా మిగిలినభారతమును తాను రచించినట్లు చెప్పుకొన్నరీతినే తాత రామాయణము రచించియుండుటచేఁ దా నుత్తరరామాయణమును రచించినట్లు తెలిపియుండును. భారతమునందుబోలె రామాయణమునందు నట్టికారణము తెలుపవలయు ననుట యావశ్యకము గాకున్నను, నిజమునకుఁ గారణ మదియే యైనయెడల దానిం జెప్పకపోయిన మానెఁగాని మఱియొకకారణమును జెప్పఁడు. అట్లు గాక తనయుత్తరరామాయణరచనకుఁ గారణము

క.

ఎత్తఱి నైనను ధీరో
దాత్తనృపోత్తముఁడు రామధరణీపతి స
ద్వృత్తము సంభావ్య మగుట
నుత్తరరామాయణోక్తి యుక్తుఁడ నైతిన్.

అని మఱియొకటిని చెప్పియున్నాడు. ఇందుఁ దా నుత్తరరామాయణమును వ్రాయుటకు ధీరోదాత్తుఁ డగు రామధరణీపతి సద్వృత్తము సంభావ్య మగుట హేతు వని చెప్పియున్నాఁడు. కాని భాస్కరుఁడు రామాయణము రచింపగా మిగిలినది యగుటయే హేతు వని చెప్పలేరు. సూచింపనులేదు. ఇదియే కారణ మగునేని దీనిం జెప్పు బ్రసక్తి కలిగినపుడు చల్లకు వచ్చి ముంత దాఁచినట్లు చెప్పక విడుచునా? చెప్పక విడిచినను మఱొకటిం జెప్పునా? తిక్కన, మంత్రిభాస్కరుండు కవితాపరిపాటియు గుంటూరివిభుత్వమును గలవాఁ డగుటం జూచి తనతాత యగుటచే గొప్పగా వర్ణించుకొన్నాఁడు. ఇంతేకాని నిజముగా గవిబ్రహ్మయు లాక్షణికశిరోమణియు నగునతనికవితకు వన్నె దెచ్చునట్టి పేరుగన్న మహాకవి యీమంత్రిభాస్కరుఁ డయినయెడల నితని నిటీవలికవులు తమకృతులంను దిక్కననుంబోలె నేల స్తుతింపరయిరి? మంత్రిభాస్కరుండును మహాకవితాఖ్యాతిగలవాఁ డనుటకు రావిపాటి తిప్పరాజు చెప్పిన

మ.

సరి బేసై రిపు డేల భాస్కరులు భాషానాథ, పుత్రా వసుం
ధరయం దొక్కఁడు మంత్రి యయ్యె, వినుకొండన్ రామయామాత్యభా
స్కరుడో, యౌ, నయినన్ సహస్రకరశాఖల్ లే, వవే యున్నవే,
తిరమై దానము సేయుచో రిపుల హేతిన్ వ్రేయుచో వ్రాయుచోన్.

అనుపద్యము నుదాహరింపఁబడియున్నది. ఇందు, రాయన భాస్కరుని ఖ్యాతి తెలియుచున్నది గాని యది దాతృత్వముచేతను శౌర్యముచేతను వచ్చినఖ్యాతి