పుట:భాస్కరరామాయణము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంవత్సరమే తిక్కన గణపతిదేవునిఁ జూచి పిదపఁ గొన్నిమాసములకు మృతి నొంది యుండవచ్చును. అయినను బ్రహ్మశ్రీ - వీరేశలింగము పంతులవారు తిక్కన కాశ్రయుఁ డైనమనుమసిద్ధి పదుమూఁడవశతాబ్దముమధ్యమువాఁడుగాఁ గొన్నిశాసనముల నుదాహరించియున్నారు. వానింబట్టి తిక్కన పదుమూఁడవశతాబ్దమున నుండె నని తోచుచున్నది. మఱియు మనుమసిద్ధి తిక్కనను 'ఏ నిన్ను మామ యనియెడి, దీనికిఁ దగ నిమ్ము భారతీకన్యక'నన్నట్లు మామా యని పిలుచుటచేఁ దిక్కన రాజుకంటెఁ బెద్దవాఁడనియుఁ గాన మనుమసిద్ధి తిక్కనపిదపఁ గూడ బ్రతికియుఁడవచ్చు ననియు తోఁచెడిని, కనుకఁ దిక్కన మనుమసిద్ధితోఁ బాటిగాను గణపతిదేవునితోఁ బాటిగాను బదుమూఁడవశతాబ్దముమధ్యమువఱకు నుండనక్కఱలేదు. ఆశతాబ్దముతొలుత నుండవచ్చును. మఱి మెకంజీదొరగరు సంతరించిన ప్రతిలోని 'అంబరమణి' యనుపద్యముంబట్టియు నాప్రతులలోనే మఱియొకచోటఁ బ్రతాపరుద్రునిప్రేరణమునఁ దిక్కన భారతమును రచించినట్లు తెలుపఁబడియుండుట బట్టియు, నీవ్రాఁతకుఁ దార్కాణముగా నతఁడు భరతమున 'ఈకృశంబు లగు పుణ్యప్రబంధంబులు దేవసన్నిధిని బ్రశంసించుటయు నొక్కుయారాధనవిశేషం బగుటం చేసి' యన్నవాక్యముచొప్పున నోరుగల్లునం దొకగదిలో నతఁడు గూర్పండి భారతమును వ్రాసిన ట్లీప్రతిలోనే చెప్పంబడి యుండుటంబట్టియు, మొదటిప్రతాపరుద్రునికాలమువాఁడని తేలుటచే పండ్రెండవశతాబ్దమందు నున్నవాఁ డని తెలియుచున్నది. కవులచరిత్రమునుబట్టి పదుమూఁడవశతాబ్దమునందు నున్నవాఁ డని తెలియుచున్నది. ఈరెండుపక్షములకును సామరస్యముగాఁ బండ్రెండవశతాబ్దముతుదను బదుమూఁడవశతాబ్దముతొలుతను నున్నవాఁ డనుట యన్నిపక్షములకుఁ జేరికగా నున్నది. తిక్కన బండ్రెండవశతాబ్దముతుదివాఁ డనుటచే నతనితండ్రి కొమ్మన పండ్రెండవశతాబ్దమునడిమివాఁ డనియుఁ గొమ్మనను నాలుగవకొడుకుగాఁ బడసిన యతనితండ్రి మంత్రిభాస్కరుఁడు పండ్రెండవశతాబ్దముతొలుతను బదునొకండవశతాబ్దముతుదను నుండవచ్చు ననియుఁ దేలుచున్నది.

సాహిణిమారునికడకు వత్తము. ఇతఁడు పదునాలుగవశతాబ్దమువాఁడు. ఇతనికిఁ బదునొకండవ పండ్రెండవశతాబ్దములం దుండిన మంత్రిభాస్కరుడు కృతి నె ట్లియ్యఁగలఁడు? పదునాలుగవ శతాబ్దమువాఁడగు హళక్కి భాస్కరుఁడే యియ్యఁగూడును గాక. ఇట్లు కృతిపతి కృతికర్తల చరిత్రాదులఁబట్టి పరిశీలించినను సాహిణిమారన కంకితము సేయఁబడినయారణ్యకాండమును రచించిన భాస్కరుఁడు హళక్కి భాస్కరుఁడే కాని మంత్రిభాస్కరుడు కాఁ డని తేలుచున్నది.

చాటువులు - ప్రతీతులు - పుక్కిటిగాథలు

తిక్కన తనతాతను, 'సారకవితాభిరాముఁ' డన్నపద్యమున నతనిని గవి యని