పుట:భాస్కరరామాయణము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్కరుఁడు నుండుటచే వీరిరువురు సమకాలికు లై యున్నారు. మొదట సాహిణీమారుఁడు ప్రతాపరుద్రునికొలువున దండనాథుఁడుగా నుండెను. ఆరాజును మహమ్మదీయులు పట్టుకొని కారాబద్ధునిఁ జేసిన పిదప నాతని క్రింది సేనాపతులు మొదలగువారు స్వతంత్రులై యతనిరాజ్యమును బంచుకొని రాచరికముతో నేలి రని తెలియుచున్నది. అతని సేనాని యగుపోలయ వేమారెడ్డి వినుకొండరాజ్యమును స్థాపించెను. సాహిణిమారుఁడును స్వతంత్రుఁడై కొండసీమకు (కొండవీఁడు కాఁబోలు) రాజయ్యె. ఇతఁడు దండనాథుఁడును రాజును నయ్యె ననుటకు

మారయధర, ణీరమణోత్తముఁడు సాహిణీతిలక మిలన్.

ఆరణ్య

అనుట ప్రమాణము. మఱియు నప్పకవీయమం ముదాహరింపఁబడిన

క.

అప్పు లిడునతఁడు ఘనుఁడా?
యప్పు డొసఁగి మరలఁ జెందునాతఁడు రాజా?
చెప్పఁగవలె సాహిణిమా
రప్పను దానమున ఘనుఁడు రాజు నటంచున్.

ఆరణ్య

అనెడి యీ హళక్కి భాస్కరుని పద్యమువలని సాహిణిమారుఁడు రా జగుటయు హళక్కి భాస్కరుండు నతనికాలమువాఁడే యగుటయు స్థాపితమగుచున్నవి. ఇట్లు పదునాలుగవ శతాబ్దమందు సాహిణీమారనయు హళక్కి భాస్కరుఁడు నుండి రనియు నప్పుడే రామాయణము రచింపఁబడె ననియుఁ దెలియుచున్నది.

ఇంక మంత్రిభాస్కరునికాలమును విచారింతము. దీనిని దిక్కనకాలమునుబట్టియే కాక మఱొకవిధమున నిర్ణయించుట కయితి లేదు. సోమదేవరాజీయమందుఁ దిక్కన కాకతీయ గణపతిదేవుని దర్శింపవచ్చిన ట్లున్నది. గణపతిదేవుఁడు పదుమూఁడవ శతాబ్దము మధ్యమువఱకు రాజ్య మేలిన ట్లున్నది. ఆనాఁటికే తిక్కన సోమయాజి యై భారతాదులను రచించియుండెను గాన యప్పటికిఁ జాల వయస్సు చెల్లినవాఁడై యుండఁగూడును. కాన యతఁడు పండ్రెండవశతాబ్దమునఁ గూడ నుండవచ్చును. మఱియు మెకంజీ దొరగారు సంపాదించి చెన్నపురి రాజకీయపుస్తకనిలయమం దుంచిన వ్రాతప్రతులలో నొకట

క.

అంబరరవిశశిశాకా
బ్దంబులు చనఁ గాళయుక్తి భాద్రపదపుమా
సంబున నంబరమణిబిం
బం బనఁదగు తిక్కయజ్వ బ్రహ్మముఁ జేరెన్.

అని యున్నది. ఇది శాలివాహనశకము 1120 సం॥ లు చనఁగా, అనఁగా 1121వ సం॥న తిక్కన మృతి నొందినట్లు చెప్పుచున్నది. ఈశకవర్షము 1121 కాళయుక్తియే యగుచున్నది. ఇందులకు హూణశకము 1199వ సం॥ మగుచున్నది. దేశచరిత్ర 1199 సం॥ మే 1199 సం॥ మే గణపతిదేవుఁడు రాజ్యమునకు వచ్చె ననుటచే