పుట:భాస్కరరామాయణము.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పొదవ వినూతనాంబరసముజ్జ్వలభూషణపూర్వకంబుగా
ముదమున నిచ్చి యిం పలర ముద్దియతో మునిపత్ని యి ట్లనున్.

302

సీతాదేవి యననూయతోఁ దనవివాహవృత్తాంతము చెప్పుట

క.

నిను రాముఁడు వరియించుట, విని యుండుదుఁ గొంత యంతవృత్తాంతంబున్
జనకజ నీచే నిప్పుడు, వినఁ గోరెదఁ జెప్పు మనుడు వేడుకతోడన్.

303


తే.

రాజధర్మంబు మెఱయ భూరక్షణంబు, సలుపుచుండి మజ్జనకుఁడు జనకుఁ డెలవి
సకలసహధర్మచారిణీసహితుఁ డగుచు, నుచితకర్మంబునకు నేఁగి యొక్కనాఁడు.

304


క.

ఝణఝణితకనత్కంకణ, మణిమయమంజీరజనితమంజులశింజా
రణితనభోభాగనిరీ, క్షణ మల్లన సేసి మేనకం బొడగాంచెన్.

305


క.

కని యయ్యచ్చరరూపం, బున కచ్చెరు వంది యధికపుణ్యుఁడఁ గానే
యనపత్యుఁడ నగునే ని, వ్వనజాననయం దపత్యవంతుఁడ నైనన్.

306


తే.

అనుచుఁ దలపోయ నీకు నిత్తనులతాంగి, వలన సమరామణీయకవైభవంబు
వెలయ మానసాపత్యంబు గలుగు నిప్పు, డనుచు వీతెంచె నొకవాక్య మాకసమున.

307


జనపతియును నవ్వాక్యము, విని యలరుచు బీజముష్టివిక్షేప మొన
ర్చునెడం బృథ్వీగర్భం, బునఁ బుట్టితిఁ దదనురాగభూషిత నగుచున్.

308


వ.

ఇవ్విధంబున మేదిని భేదించుకొని జనియించిననన్నుం గనుంగొని మజ్జనకుండు
విస్మితుఁ డగుచు నెత్తికొని యపత్యస్నేహానందంబు నంద మఱియు నాకాశ
వాణి యి ట్లనియె.

309


క.

సీతాపద్ధతి నీసుత, భూతలమునఁ బొడమెఁ గాన భూతి దలిర్పన్
సీత యనుపేరు భువి వి, ఖ్యాతంబుగ నుల్లసిల్లు నని పల్కుటయున్.

310


ఆ.

కురిసెఁ బుష్పవృష్టి సురదుందుభులు మ్రోసె, జనకుఁ డప్పు డధికసంభ్రమమున
మహితచరిత యగ్రమహిషిచేఁ గూఁతుఁగా, బెంప నిచ్చె నన్ను బ్రియముతోడ.

311


అంత నొక్కనాఁడు.

312


క.

ఏనును బరిణయయోగ్యం, బైన వయోంతరముఁ బొందునప్పుడు నాకున్
మానవనాథుఁడు తగువరుఁ, గానక చింతించి బుద్ధిఁ గని మంత్రులతోన్.

313


క.

సీతాస్వయంవర మ్మని, భూతలమునఁ గలుగు సకలభూపాలురకుం
బ్రీతి నెఱిఁగింపఁ బుచ్చుట, నీతి యనుచుఁ జేసెఁ కార్యనిశ్చయము మదిన్.

314


వ.

ఇట్లు కార్యంబు నిశ్చయించి సమస్తరాజన్యుల రప్పించి తానును మున్ను జన్నం
బొనరించుసమయంబున నధికనత్వసంపన్ను లగువారు పదివేవురు మోచి తె
చ్చిన యొక్కమహనీయకోదండంబును నక్షీణబాణతూణీరంబులును వరుణనిక్షి
ప్తంబు లయి నిజమందిరంబునం దేజరిల్లువాని నమ్మనుజపతులకుం జూపి యిక్కా
ర్ముకం బొక్కచేత నెత్తి యెక్కిడి తెగఁ దిగువం జాలుభూపాలున కిత్తు నాకూఁ
తు నని పలుకుడు నచ్చాపం బపలక్షించి యిది ధరాధరదుర్ధరం బని మ్రొక్కు