పుట:భాస్కరరామాయణము.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని వెండియు.

290


తే.

ఒక్కమన్ననతో నున్న నొల్లకున్నఁ, గరము నెయ్యుఁడై యున్నను గాక యున్న
మగఁడు ప్రియతముఁ డనిలయుండు మానవతికి, నెల్లలోక సుఖంబులు నెదురు వచ్చు.

291


క.

నడవడి యొప్పక యుండినఁ, గడునిర్ధనుఁ డయినఁ బతియె గతియును విను మె
క్కుడుబంధుండును బ్రియుఁడుం, బడఁతులకుం బరమగురుఁడుఁ బరదేవతయున్.

292


తే.

ఇంతి శీలదోషంబుల నిట్టిపతికి, నతివ లెవ్వరు ప్రతికూల లయి చరింతు
రమ్మహాపాపవతులు దుర్యశము నొంది, కూలి కాంతు రధోలోకఘోరగతుల.

293


క.

పతిపరిచర్యాపరిణత, గతి లోకము మేలు కీడు గనియుండు పతి
వ్రతలు నినుఁ బోని గుణవతు, లతులితసుఖకీర్తు లెందు నందుదు రబలా.

294


ఉ.

నావుడుఁ బత్నికిం బతియ నమ్మినబంధుఁడు నిష్టదైవముం
గా వివరించి మజ్జనని గారవ మారఁగ మున్ను సెప్పె నా
కీవిధ మత్తగారుఁ గృప యేర్పడ నానతి యిచ్చి రిఫ్డు మీ
చే విని ధన్య నైతి విలసిల్లె మనంబు మహాతపస్వినీ.

295


ఉ.

ముత్యము లైనజన్నములునూఱును వేమఱు సేసినం దప
స్సత్యశమక్షమాదిగుణసంపదతోడ వనైకవాసు లై
నిత్యసమాధియోగమున నిల్చిన నేరికిఁ బొందవచ్చునే
పత్యనుకూల లైనకులపాలిక లందెడు పుణ్యలోకముల్.

296


చ.

పతియెడ రెండు లేక కులభామలు తా రతఁ డెట్టిఁ డైన న
న్మతిఁ జరియించు టొప్పు ననినం గమనీయచరిత్రుఁడుం గృపా
న్వితుఁడు జితేంద్రియుండు నతినిర్మలధర్మయుతుండు సూనృతో
ర్జితుఁడును రాముఁ డీరఘువరేణ్యుని నేగతిఁ గొల్చు టొప్పదే.

297


క.

విను కౌసల్యకుఁ దక్కిన, జననుల కతిభక్తి నొక్కసరి యై నడచున్
జనపతి యొకపరి ముట్టిన, వనజాక్షులఁ దల్లి నొక్కకవడువునఁ జూచున్.

298


వ.

అని వెండియు.

299


క.

గుణవతి సావిత్రియు స, త్ప్రణుత యరుంధతియు ధర్మపరిణత యారో
హిణియుఁ గనుట పతిశుశ్రూ, షణమునన కదా సదాయశస్సౌఖ్యంబుల్.

300


వ.

మఱియుం గొంద ఱిట్టిపతివ్రతలు పతుల నచలమతుల నారాధించి తమతమధర్మం
బుల నుత్తమలోకంబు లందుచుండుదు రిదియును మాయత్త యెఱింగించినట్టిది
యనిన ననసూయ సీతతోఁ బతిభక్తిమాహాత్మ్యవిషయం బై నీ చెప్పినవాక్యంబు
లొప్పు నీధర్మనిర్మలచరితంబునకు సంతోషించితి నీకుం బ్రియం బయ్యెడివరం
బిచ్చెద ననుటయుఁ గరంబులు మోడ్చి యచ్చెలువ నిల్చుటయుం బదంపడి.

301


చ.

ఇదె యొకకుంకుమంబు కమలేక్షణ యిచ్చెద సర్వమంగళా
స్పద మగు నివ్విలేపనము శశ్వదలంకృతి మేని కంచుఁ జెం