పుట:భాస్కరరామాయణము.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వునుం జనుదెంచు టొప్పుఁ గళత్రంబుతోడ నిట నొంటి నిలుచుట యుచితం
బు గా దని పలికి తమ్ముఁ దగువాక్యంబులం బెక్కుదెఱంగుల నిలువఁ దలంపు
గొన్న రఘునందనుల నొడంబఱిచి కులపతి మునిగణసమేతుం డయి చనియెం
దదనంతరంబ.

278


క.

మరగిన బాలమృగంబులు, దిరుగుడువడుతెఱఁగుఁ జూచి ధృతి గలఁగఁగ న
న్నరపతి బహువిధముల నచ, టెరవయి మునిశూన్య మగుట నింపక యున్నన్.

279


క.

భరతుఁడుఁ దల్లుల బంధులఁ, బురజనులం గూడి వచ్చి భూపతి లోకాం
తరగతుఁ డగు టెఱిఁగించిన, నెరి సెడినది దలఁప ధైర్య మెడలెడి నిచటన్.

280

రాముఁ డత్రిమహామునియాశ్రమంబు చేరుట

క.

నాకంటెను సౌమిత్రికి, నీకంజాక్షికి రుచింప దిక్కడ భరతా
నీకనివేశనమున న, స్తోశాశ్వద్విపకరీషదూషిత మగుటన్.

281


వ.

అని విచారించి రామభద్రుండును జిత్రకూటంబు విడిచి యత్రిమహామునియా
శ్రమంబునకుం జనుదెంచి సీతాలక్ష్మణసమేతుం డగుచు నమ్మునీంద్రునకు నమ
స్కరించిన.

282


క.

అత్రియుఁ బ్రేమ నటించుచుఁ, బుత్రునిగతిఁ జూచి యధికపూజలఁ దగ న
మ్మిత్రకులాగ్రణి కొసఁగి సు, మిత్రాసుతు సీతఁ గరుణమెయి మన్నించెన్.

283


తే.

విహితకృతు లి ట్లొనర్చి సన్మహితచరిత, సిద్ధ సహవృద్ధఁ బత్ని నీక్షించి రాజ
పత్ని యగునీయశస్వినిఁ బరమసాధ్వి, సీత మన్నింపు కోర్కులు సెలఁగ నెలమి.

284


వ.

అని పలికి రామచంద్రుం గనుంగొని.

285


సీ.

ఏకమౌనమున నీరేడువేలబ్దంబు, లత్యుగ్ర మగుతప మాచరించి
యనసూయ మనువ్రత మతినిష్ఠఁ జరియించి, తదభిధానంబుచేఁ దగు వెలింగె
బదియేఁడు లిలఁ జిన్కు పడకున్న ఫలమూల, కందముల్ గల్పించి గంగఁ బఱపె
వేల్పులు దగ వచ్చి వేఁడిన వర మిచ్చి, రాత్రులు పది యొక్కరాత్రి చేసె
నీమహాతపస్విని భూతహితచరిత్ర, బ్రహ్మచారిణి యీపుణ్యభాగ నింక
రామ కౌసల్యఁబోలె నీరాజతనయ, కొలుచుఁ గా కన్న రాఘవకుంజరుండు.

286


మ.

మునివాక్యంబులు వింటె జానకి మనోమోదంబు సంధిల్ల నీ
వనసూయన్ భజియింతుగాక భవదిష్టావాప్తికై నావుడుం
జని వాతూలవిధూయమానకదళీస్తంభంబుచందంబునం
దనుకంపంబున నొప్పు దుస్తరతపస్తప్తాంగి నత్తాపసిన్.

287


క.

కని యేను జనకనందన, ననుచుం బ్రణమిల్లి తల్లి యడిగెదఁ గుశలం
బనిన నగుఁ దల్లి సేమం, బున జనకుం డున్నవాఁడె ముదమే నీకున్.

288


ఆ.

బంధుజనుల విడిచి సింధురగామిని, రాము వెనుక ని ట్లరణ్యమునకు
వచ్చి తిచట సుఖమె నిచ్చలు ధర్మని, రీక్షణంబు సేయుదే మృగాక్షి.

289