పుట:భాస్కరరామాయణము.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గలయ దిఙ్మూఢ మగు నట్లు గాక యుండ, భూరిధారుణిభారంబు పూను మధిప.

265


తే.

దేవ కైకేయి కీడు చింతించి పాప
నింద కింతయు రోయక నిన్ను నడవి
కరుగు మని యన్మాటకు నరుగ ధర్మ
మగునె విచ్చేయు మీతెంపు కదగునె సేయ.

266


ఉ.

నీ దగురాజ్యలక్ష్మి ధరణీవర యేను ధరింపఁజాల ని
త్యోదయసంపదల్ వొదలుచుండఁ బ్రజాపరిపాలనక్రియా
పాదనలీలతో భువనభారము పూనఁగ నేఁగుదె మ్మయో
భ్యాదయితత్వ మన్యులకు నర్హము గా దటు గాక తక్కినన్.

267

భరతుఁడు రాముపావలు గొని నందిగ్రామంబున వసియించుట

వ.

ఇదె మీముందటఁ బ్రాయోపవేశంబు సేయుదు నని దర్భాస్తరణశాయి గా
నున్న నన్నరేంద్రుం డెత్తి యాతమ్మునిం గౌఁగిటం జేర్చి యిది యేమి భరతా
మనకులాచారధర్మంబులు విచారింపక యాడుచున్నావు నాయట్టికొడుకు దశ
రథునట్టితండ్రిసత్యంబు పాలింపఁడేని లోకం బెట్లు నడచు నేను వ్రతంబు సం
పూర్ణం బైనమీఁద నయోధ్యకు వచ్చెద నీచలం బుడుగు మనవుడు రావణవధం
బు గోరుచున్న కిన్నరకింపురుషగరుడగంధర్వమునీంద్రాదు లనాగతవృత్తాంతం
బెఱింగి యవ్వాక్యంబులకు సంతోషించి రక్కుమారుండును జింతాక్రాంతుం డ
గుచు మొగంబు వాంచిన వసిష్ఠుండు రామచంద్రునితో ని ట్లనియె.

268


చ.

భరతుఁడు భక్తియుక్తి నినుఁ బ్రార్థన సేయుచు నున్నవాఁడు నీ
వరయఁగ భక్తవత్సలుఁడ వట్లగుటం గృపతోడ మేదినీ
భరము భరింప నీతొడుగుపాదుక లానతియిమ్ము నావుడున్
గురువచనంబు మీఱక రఘుప్రవరుం డటు సేసి తమ్మునిన్.

269


చ.

ప్రియ మడరంగ వీడు కొలిపెన్ మది నప్పుడు రామచంద్రుని
శ్చయముతెఱం గెఱింగి రఘుసత్తముచిత్తము నొచ్చునంచుఁ దా
భయమున నొత్తి యెండొకటి పల్కక సానుజుఁ డై దివాకరా
న్వయపతికిం బ్రదక్షిణము వచ్చి నమస్కృతి సేసి భక్తితోన్.

270


వ.

భరతుం డుచితప్రకారంబున వీడుకొని మస్తకంబున నప్పాదుకలు ధరియించి చని
శత్రుంజయం బనుపట్టపేనుంగుకుంభస్థలంబునం బెట్టి తానును శత్రుఘ్నుండును
నిరుగెలంకుల ఛత్రచామరంబులు ధరియించి సమస్తపరిజనంబులుం దానును
జిత్రకూటంబు వెడలి భరద్వాజుని కంతవృత్తాంతంబునుం జెప్పుచు గుహున
కెఱింగించుచు నేతెంచి యయోధ్యానగరంబు సొచ్చి తల్లుల నంతఃపురంబునకుం
బుచ్చి మూలబలంబు నగరికాపు పెట్టించి రామశూన్యం బగునప్పురంబున నుండ
రోసి సమస్తమంత్రిజనానుమతంబున నందిగ్రామంబున.

271